Sunday, May 19, 2024

నేడు బ్రాహ్మణ భవన్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

spot_img

విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేడు ప్రారంభించనున్నారు. అనంతరం ఏర్పాటు చేయనున్న సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 12 నిర్మాణాలను చేపట్టారు. 2017 జూన్‌ 5న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. మూడంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సదనం ఉన్నాయి. భక్తి, ఆధ్మాత్మిక భావజాల వ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్‌ సెంటర్‌గా ఈ భవనం సేవలందించనున్నది. ఆధ్యాత్మిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల వంటి సాహిత్యంతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

పీఠాధిపతుల హాజరు
బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మంగళవారం సదనం ప్రాంగణంలో సుదర్శన హోమం నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, పండితులు ఇప్పటికే సదనానికి చేరుకున్నారు. ఈ రోజు చండీయాగం నిర్వహించనున్నారు. చండీయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొంటారు. పూర్ణాహుతి అనంతరం సదనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జరిగే సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సదనం ప్రారంభోత్సవానికి వచ్చేవారికి అన్నపూర్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున నరేంద్ర కామరాజు భోజన ఏర్పాట్లు చేశారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు పథకాలు
తెలంగాణలోని బ్రాహ్మణుల సర్వతోముఖాభివృద్ధి కోసం 18 మంది సభ్యులతో కూడిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి రిటైర్డ్‌ ఐఎఎస్‌ కేవీ రమణాచారి సారథ్యం వహిస్తున్నారు. పరిషత్తు ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్నది.

Latest News

More Articles