Wednesday, May 8, 2024

కేసీఆర్‌ రికార్డు.. 24 మంది తెలుగు సీఎంలలో ఎవరికీ దక్కని కీర్తి

spot_img

అతడి పట్టుదలకు… ఓటమి భయపడి దాక్కుంటుంది! అతడి సంకల్పానికి… కల నిజమై కళ్లెదుట నిలుస్తుంది! అతడి తపస్సుకు… పాతాళ గంగ పరవశించి పైకెక్కుతుంది! అతడి దార్శనికతకు… భవిష్యత్తు ముందే సాక్షాత్కరిస్తుంది! అతడి దక్షతకు… అందరి సంక్షేమం అభివృైద్ధె అవతరిస్తుంది! అతడి దీక్షకు… కాలం రికార్డుగా మారి కలకాలం నిలుస్తుంది!! సమయమే స్వయంగా పురస్కారమై పూలమాలతో వరిస్తుంది!!

2023 జూన్‌ 2… తెలంగాణ పదో పుట్టిన రోజు మాత్రమే కాదు; మరో విశేషం కూడా ఉన్నది. అది… ఒక తెలుగు నాయకుడు ఒక రాష్ట్రానికి, నిరంతరాయంగా, ఏకబిగిన అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొలువుదీరి రికార్డు సృష్టిస్తున్న సందర్భం కూడా! స్వాతంత్య్రానికి పూర్వం మద్రాసు ప్రెసిడెన్సీ, మొన్నటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, హైదరాబాద్‌ స్టేట్‌, నిన్నటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, నేటి తెలంగాణ, ఏపీ (విభాజిత) రాష్ర్టాల దాకా ఎక్కడ చూసినా, ఒక తెలుగు నాయకుడు గ్యాప్‌ లేకుండా, ఏకబిగిన, ఇంత సుదీర్ఘ కాలం, ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. ఈ రికార్డును సృష్టిస్తున్న నేత మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. 2014 జూన్‌ 2న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌… 2023 జూన్‌ 2తో తొమ్మిదేండ్ల పదవీకాలాన్ని దాటనున్నారు.

సౌత్‌ ఆఫ్‌ నార్త్‌, నార్త్‌ ఆఫ్‌ సౌత్‌ (ఉత్తరాదికి దక్షిణం…దక్షిణాదికి ఉత్తరం)గా దేశానికి నడిబొడ్డున ఉన్న తెలంగాణ, దశాబ్ది సంబురాలు జరుపుకొంటున్న సమయంలో, కేసీఆర్‌ ఈ సరికొత్త రికార్డును సృష్టిస్తుండడం, మన భూమి పుత్రుడికి దక్కిన విశేష గౌరవం. తెలంగాణ ప్రజలకు గర్వకారణం. ముఖ్యమంత్రులుగా పనిచేసిన తెలుగువారిలో, అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న రికార్డు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పేరిట ఉన్నది. ఆయన మూడు విడతల్లో మొత్తం 13 ఏండ్ల 247 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఏకబిగిన ముఖ్యమంత్రిగా కొనసాగింది మాత్రం 8 ఏండ్ల 256 రోజులు మాత్రమే! అది ఉమ్మడి రాష్ట్రానికి! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2004లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు, పదేండ్ల తర్వాత 2014లో విభాజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎం అయ్యారు. అంటే రెండు వేర్వేరు రాష్ట్రలకు ముఖ్యమంత్రి అయ్యారన్న మాట! ఇప్పటిదాకా ఒక రాష్ట్రానికి ఏకబిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరిట ఉన్న 8 ఏండ్ల 256 రోజుల రికార్డును, ఈ జూన్‌ 2తో అధిగమించి, మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా.. కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేండ్ల 221 రోజులు, నారా చంద్రబాబునాయుడు ఎనిమిదేండ్ల 256 రోజులు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఐదేండ్ల 111 రోజులు పదవిలో కొనసాగారు. వీరందరి కంటే ఎక్కువగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ జూన్‌ 2తో సరిగ్గా తొమ్మిది ఏండ్లను పూర్తి చేసుకోబోతున్నారు.

చరిత్రలోకి తొంగి చూస్తే!
చరిత్రకు అందినంతవరకు అటు మద్రాసు ప్రెసిడెన్సీ మొదలుకుని, తెలంగాణ- ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రాల దాకా చూస్తే, ఇప్పటివరకు 24 మంది నేతలు ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. వీరిలో కొందరు రెండుసార్లు, కొందరు మూడుసార్లు కూడా పదవి చేపట్టారు. ముఖ్యమంత్రి పదవిని మొట్టమొదటిసారిగా చేపట్టిన తెలుగు వ్యక్తి పానగంటి రామరాయనింగర్‌. చిత్తూరు జిల్లా కాళహస్తిలో జన్మించిన ఆయన తెలుగు పద్మనాయక వెలమవర్గానికి చెందిన వారు. పానగల్‌ రాజాగా సుప్రసిద్ధులు. మద్రాసు ప్రెసిడెన్సీకి రామరాయ రెండో ముఖ్యమంత్రిగా పని చేశారు. దాదాపు నాలుగేండ్ల పైచిలుకు సమయం ఆయన ఆ పదవిలో ఉన్నారు. తన పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. ఆ తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అయినప్పటికీ, కేవలం 10 నెలలు, (తరువాత ఆంధ్ర రాష్ర్టానికి 13 నెలలు) మాత్రమే పదవిలో ఉండగలిగారు.

మద్రాసు ప్రెసిడెన్సీ ఆ తర్వాత మద్రాసు రాష్ట్రంగా మారడం, తర్వాత ఆంధ్రా దాన్నుంచి విడిపోవడం, తెలంగాణతో కలిసి ఉమ్మడి ఏపీ ఏర్పడడం జరిగిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటికీ, పదవిలో ఉన్నది కేవలం మూడేండ్లు మాత్ర మే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కువకాలం ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన నేతలు నలుగురు. కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీయార్‌, చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా… కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేండ్ల 221 రోజులు, చంద్రబాబు ఎనిమిదేండ్ల 256 రోజులు, వైఎస్‌ ఐదేండ్ల 111 రోజులు పదవిలో ఉన్నారు. వీరందరి కంటే ఎక్కువగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, ఈ జూన్‌ 2తో సరిగ్గా తొమ్మిది ఏండ్లను పూర్తి చేసుకోబోతున్నారు. ఒక తెలుగు నాయకుడు, ఒక రాష్ర్టానికి, మధ్య లో దిగిపోకుండా, నిరాటంకంగా, ఏకబిగిన ఇంతటి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం ఇదే మొట్టమొదటిసారి!

ఆ నేతల రూటు సెపరేటు!

కేసీఆర్‌ సాధిస్తున్న ఈ రికార్డు అంత ఈజీగా సాధ్యమైనదేమీ కాదు. అనేక ప్రతికూల పరిస్థితుల్లో పదవిని చేపట్టి, పలు ఒడిదొడుకులను, సుడిగుండాలను దాటి, అడ్డంకులను అధిగమించి, ఇంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ విషయంలో ఇతర నాయకులకు, కేసీఆర్‌కు అసలు పొంతనే లేదు. తెలుగు నాయకుల్లో గణనీయ కాలంపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీయార్‌, చంద్రబాబు, వైఎస్‌ పేర్లు వినిపిస్తుంటాయి. కాసు, వైఎస్‌లు ఒక జాతీయ పార్టీ ప్రతినిధులుగా మాత్రమే ముఖ్యమంత్రులయ్యారు. అది పార్టీ ఎంపికే తప్ప నేరుగా ప్రజలది కాదు. ఇక ఎన్టీయార్‌ది మరో రకమైన పరిస్థితి. నాటి ప్రధాని ఇందిరాగాంధీతో వ్యక్తిగతంగా వచ్చిన పేచీ వల్ల పట్టుదలకు పోయిన ఎన్టీయార్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. దానికి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నినాదంగా అద్దారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ వ్యవహారశైలిపై అప్పటికే ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్న తీవ్ర వ్యతిరేకత కలసి రావడంతో ఎన్టీయార్‌ ముఖ్యమంత్రి కాగలిగారు. అంతేతప్ప ఎన్టీయార్‌కు నిర్దిష్టంగా పెద్ద లక్ష్యంగానీ, ప్రజల పక్షాన భారీ ఎజెండాగానీ పార్టీ పెట్టిన నాడు లేవు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ఆయన పేదల కోసం అనేక మంచి పనులు చేసి, ప్రజాదరణ చూరగొన్న మాట వాస్తవం. ఇక తెలుగు నాయకుల్లో సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా చంద్రబాబు చెప్పుకొన్నప్పటికీ, ఆ వాదనకున్న పవిత్రత (సాంక్టిటీ) తక్కువ. ఎందుకంటే, తొలిసారి 1995లో చంద్రబాబు, ఎన్నికల ద్వారా కాకుండా, మరో మార్గంలో ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చారు. 1994లో జరిగిన ఎన్నికల్లో ప్రజా తీర్పు చంద్రబాబు కోసం ఇచ్చింది కాదు. అప్పుడు ఓటర్లు ఎన్టీయార్‌కు ఇచ్చిన మాండేట్‌ను, చంద్రబాబు దొడ్డిదారిన చేజిక్కించుకుని సీఎం అయ్యారు. ఇక 2014లో ఆయన విభాజిత ఏపీకి ము ఖ్యమంత్రి. అంటే రెండు వేర్వేరు రా ష్ర్టాలకు సీఎం! కేసీఆర్‌ది వీరికి భిన్నమైన పరిస్థితి. తనకై తాను పార్టీ పెట్టి, తానే ఉద్యమం నడిపి, రాష్ట్రం తెచ్చి, తానే సారథిగా ఎన్నికల బరిలో నిలిచి, స్పష్టమైన మెజారిటీతో గెలిచి, కూల్చివేత కుట్రల్ని ఎదుర్కొని, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగువాడిగా చరిత్ర సృష్టించడం, అది కేసీఆర్‌కే సాధ్యమైన అద్భుతం.

ఇంతకాలం… అంత సులువు కాదు
దేశంలో మరే రాజకీయ నాయకుడికీ లేనంత ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్‌ రాజకీయాల్లో కొనసాగి, అపూర్వమైన, అనితర సాధ్యమైన విజయాలు సాధించారు. కాసు, వైఎస్‌లాగా కేసీఆర్‌కు పెద్ద జాతీయ పార్టీ అండ లేదు. ఎన్టీఆర్‌లాగా సినీ ప్రజాకర్షణ లేదు. చంద్రబాబులాగా కుల బలం, మీడియా బలగం లేదు. ధన బలం అంతకంటే లేదు. అయినా కేసీఆర్‌ సుదీర్ఘకాలం 45 ఏండ్లు రాజకీయాల్లో కొనసాగడం, ఒక్కసారి మినహా ఎన్నడూ ఓటమిని ఎదుర్కొనకపోవడం, ఇప్పుడు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించడం విశేషం. తెలంగాణ నుంచి గతంలో జలగం వెంగళరావు, టీ అంజయ్య, పీవీ నరసింహారావు, చెన్నారెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ వీరెవ్వరినీ కనీసం ఐదేండ్ల పాటు కూడా అధికారంలో ఉండనివ్వలేదు. నడి మధ్యలోనే పడదోశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ను దెబ్బతీయడానికి కూడా అనేక ప్రయత్నాలు సాగాయి.

పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ సాక్షిగా కూల్చివేత కుట్ర జరిగింది. వీడియో కెమెరాల సాక్షిగా ఓటుకు నోటు పన్నాగం బయటపడింది. ‘బెర్లిన్‌ గోడలు కూలిపోలేదా? అట్లే తెలంగాణ అంధ్రా మళ్లీ కలుస్తాయి’ అంటూ వ్యాఖ్యలు నాడే కాదు, నేటికీ వినిపిస్తున్నాయి. వైకుంఠపాళిలో పెద్దపాము, చిన్నపాములా మారిన ఈ క్రీడలో కేసీఆర్‌ 9 ఏండ్ల పాటు అప్రతిహతంగా ముఖ్యమంత్రిగా కొనసాగి, తెలుగు రాజకీయ నాయకులెవ్వరికీ సాధ్యంకాని రికార్డు సృష్టించడం అసాధారణం. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నిలువరించడానికి ఉద్యమ సమయంలో ప్రత్యర్థులు లేవనెత్తిన ప్రతి వాదననూ, కేసీఆర్‌ తన పరిపాలనతో తుత్తునియలు చేశారు. చిన్నదైన తెలంగాణ రాష్ట్రంగా మనుగడే సాధించలేదన్నారు. కేసీఆర్‌ తెలంగాణకు భౌగోళిక సుస్థిరతే కాదు, రాజకీయ సుస్థిరతనూ కల్పించారు. తెలంగాణ వాళ్లకు పరిపాలనే చేత కాదన్న చోట, ముఖ్యమంత్రిగా ఏకబిగిన సుదీర్ఘ కాలం పరిపాలించడమే కాదు.

తెలంగాణను దేశానికే రోల్‌ మాడల్‌గా నిలిపారు. తెలంగాణ వాళ్లకు వ్యవసాయం రాదన్న చోట, దేశానికే అన్నంపెట్టే అక్షయ పాత్రలా తెలంగాణను తీర్చిదిద్దారు. తెలంగాణకు నీళ్లుండయి అన్న చోట, ప్రపంచంలోనే అతి భారీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, భూమ్మీదే సాగరాలను కట్టి, గోదావరి జలాలను పంట పొలాల్లో పారించారు. తెలంగాణ చీకట్లలో మునిగిపోతుందన్న చోట, 24 గంటలు నిరంతర వెలుగులు విరజిమ్మే పవర్‌హౌస్‌లా రాష్ర్టాన్ని తీర్చిదిద్దారు. హైదరాబాద్‌ ఖాళీ అయితుందన్నచోట మరో హైదరాబాద్‌ అంతటి పేద్ద నగరాన్ని సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. పరిశ్రమలు తరలిపోతాయన్న చోట వేలాది కొత్త పరిశ్రమల్ని నిలబెట్టారు. ఖజానా ఖాళీ అయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేరన్న చోట దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇస్తున్నారు. ఉపాధి, ఉద్యోగాలు లేక యువత నక్సలిజం వైపు మళ్లుతారన్న చోట, హింస ఊసే లేకుండా చేశారు. ఇట్లా చెప్పుకొంటూ పోతే ఎన్నో! 9 ఏండ్లలో తెలంగాణ ఏం సాధించింది? అన్న ప్రశ్నకు జవాబు కోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనతో పాటే ఏర్పడిన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను చూసి, బేరీజు వేసుకుంటే చాలు!

వారసత్వ బలం లేకున్నా!
దేశంలో ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న పలువురికి అయితే పార్టీ బలమో, లేక కుటుంబ నేపథ్యమో అండగా ఉన్నాయి. అటు పెద్ద పార్టీ అండ లేకుండా, కుటుంబ వారసత్వం లేకుండా, కేవలం తనకు తానై ఒక కాజ్‌ కోసం కొట్లాడి, తానే పార్టీ స్థాపించి, రాజకీయాల్లో గెలిచి, నిలిచిన వ్యక్తి కేసీఆర్‌. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ తన తండ్రి ములాయం సింగ్‌ వారసునిగా, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తన తండ్రి బాల్‌ఠాక్రే వారసునిగా, తమిళనాడు సీఎం స్టాలిన్‌ దివంగత సీఎం కరుణానిధి వారసునిగా, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారసునిగా, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తన తండ్రి బిజూ పట్నాయక్‌ వారసునిగా, జార్కండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ మాజీ సీఎం శిబూసోరెన్‌ వారసునిగా, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ వారసునిగా పదవులు అనుభవిస్తున్న వారే. వీరంతా తమ కుటుంబ రాజకీయ వారసులుగా వచ్చి పదవులు అనుభవిస్తున్నవారే. కానీ ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా సొంతంగా ఒక పార్టీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక రాష్ర్టాన్ని సాధించి, సాధించిన రాష్ర్టానికి స్వయంగా ముఖ్యమంత్రి అయిన అరుదైన చరిత్ర ఒక్క కేసీఆర్‌కే దక్కుతుంది.

క్రియేటివ్‌ ట్రెండ్‌ సెట్టర్‌!
తెలంగాణ రాష్ర్టం ఆవిర్భావం తర్వాత ప్రతీ రంగంలోనూ సంస్కరణలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనదైన ముద్రవేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను పాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలుగా విభజించారు. విభజించడంతోనే సరిపెట్టకుండా ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నూతనంగా సమీకృత పాలనా భవనాలను నిర్మించారు.

అలాగే ప్రతి ఐదు వందల జనాభా కలిగిన ఆవాసాన్ని ఒక గ్రామ పంచాయతీగా, అలాగే ప్రతి తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. ఎప్పుడో నిజాం కాలంలో జరిగిన వ్యవసాయ భూముల సర్వేను మళ్లీ నిర్వహించి కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలను జారీ చేశారు. ఎలాంటి ప్రయోజనం లేని వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా లెక్కా పత్రం లేని వ్యవసాయ భూములను ధరణి పోర్టల్‌ ద్వారా క్రమబద్ధీకరించారు. ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసే ప్రక్రియ త్వరలో పూర్తి కాబోతున్నది. హైదరాబాద్‌ను దేశంలోనే మేటి ఐటీ హబ్‌గా తీర్చిదిద్దారు. కేసీఆర్‌ కిట్స్‌, కంటి వెలుగు వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. అబ్బుర పరిచే విధంగా నూతన సచివాలయ భవనాన్ని రికార్డుస్థాయిలో స్వల్ప వ్యవధిలో పూర్తి చేసి ఇటీవలనే అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రాజ్యాంగంలో కల్పించిన వెసులుబాటుకు కృతజ్ఞతగా కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంగా నామకరణం చేశారు. దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఏర్పాటు చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపం కూడా త్వరలో ఆవిష్కరణ కాబోతున్నది. గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంక్‌గా చూసిన మైనారిటీలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా దేశంలో మరే రాష్ట్రంలో లేనన్ని మైనారిటీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేశారు. సంక్షేమ ఫలాలు అందించడానికి దారిద్య్రరేఖకు దిగువనున్న వారి లెక్క తేల్చడానికి సమగ్ర సర్వే నిర్వహించారు. తద్వారా కులవృత్తుల పునరుజ్జీవనానికి చేపల పెంపకం, గొర్రెల పెంపకం వంటి పథకాలకు శ్రీకారం చుట్టారు.

9 ఏండ్లలో కాదు.. ఆరేండ్లలోనే!
కేసీఆర్‌ ఇవన్నీ సాధించింది కేవలం 9 ఏండ్లలోనే అని ప్రపంచం ఆశ్చర్యపోతున్నది. లెక్కకు 9 ఏండ్లే అయినా నిజానికి కేసీఆర్‌కు దొరికింది ఆరేండ్ల సమయమే! 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం, కొత్త పరిపాలన. దిక్కు లేదు, మొక్కు లేదు. ఎటుపోవాలో, ఏం చేయాలో, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెల్వని పరిస్థితి. అటూ ఇటూ సదురుకునే సరికే ఆర్నెల్లు గడిచిపోయాయి. కొంచం కుదురుకుని ప్లానింగ్‌ చేసుకుందాం అనుకునే సమయంలో కూల్చివేత కుట్రలు. ఎలాగూ విడిపోయాం, మన ప్రాంతానికి వెళ్లి పరిపాలన చేసుకుందాం అనుకోకుండా ‘పదేండ్లు మా హక్కు’ అంటూ హైదరాబాద్‌లోనే ఉండి, సచివాలయానికి రిపేర్లు చేయించుకుని మరీ తిష్ఠవేసే ప్రయత్నం చేశారు. ఎలాగోలా దాన్నుంచీ తెలంగాణను కేసీఆర్‌ బయటపడేశారు. అటు కేంద్రం సహాయ నిరాకరణ, తెలంగాణ భూభాగం ఆంధ్రకు అప్పగింత, చివరికి హైకోర్టును ఇమ్మన్నా ఇవ్వనంత కక్ష. పులిమీద పుట్రలా నోట్ల రద్దు విపత్తు. దానివల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం. వీటన్నింటినీ ఎదుర్కొంటూనే విపక్షాల కుట్రలను చిత్తు చేయడానికి తొలి దఫా ఆర్నెల్లు ముందే ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. ఇక రెండో దఫా అధికారంలోకి వచ్చాక రెండేండ్లు కరోనా మహమ్మారిని, దాని పర్యవసానాలను ఎదుర్కొనడానికే సరిపోయింది. ఇలా మూడేండ్లు తీస్తే ఇక మిగిలింది కేవలం ఆరేండ్లు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న అద్భుతమైన తెలంగాణ కేవలం ఆరేండ్ల కేసీఆర్‌ పాలనకు ప్రతిబింబం. పదేండ్లలో వందేండ్ల అభివృద్ధి కాదు; ఆరేండ్లలో వందేండ్ల అభివృద్ధి అంటే సరిగ్గా సరిపోతుంది.

కేసీఆర్‌ మొదటి లక్ష్యం… తెలంగాణ కోసం ప్రజా- రాజకీయ ఉద్యమాన్ని నిర్మించడం. ‘తెలంగాణ వాళ్లు ఆరంభశూరులు. పదవుల కోసం ఉద్యమాన్ని ఎప్పుడో పణంగా పెడ్తారు’ అని అప్పటికే బలమైన అపనమ్మకాన్ని ప్రచారంలో పెట్టారు. కేసీఆర్‌ దాన్ని తుత్తునియలు చేసి భారీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పక్షాలను ఏకం చేసి, జాతీయ స్థాయిలో ‘నువ్వు తెలంగాణ వైపా? కాదా?’ అనే స్థాయిలో పోలరైజేషన్‌ తీసుకువచ్చారు.

కేసీఆర్‌ రెండో లక్ష్యం… ఇటు ప్రజా ఉద్యమం, అటు రాజకీయ మార్గంతో, శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం. అసెంబ్లీ ఆమోదం లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యమే కాదన్నారు. అయితే కేసీఆర్‌ అసెంబ్లీలో ఆంధ్రా మెజారిటీని వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసి, పటిష్ఠమైన వాదన, ఎత్తుగడతో, నెత్తురుబొట్టు చిందకుండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు.

కేసీఆర్‌ మూడో లక్ష్యం… సాధించిన తెలంగాణను భౌగోళికంగా, రాజకీయంగా సుస్థిరపరచడం. ‘బెర్లిన్‌ గోడలు కూలిపోలేదా? ఇప్పుడూ అదే జరుగుతుంది. తెలంగాణ- ఆంధ్రా మళ్లీ ఏకమవుతాయి’ అని రాష్ట్రం విడిపోయిన వెంటనే వాదనలు మొదలుపెట్టారు. అంతే కాదు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి పార్లమెంటు సెంట్రల్‌ హాల్లోనే కుట్ర చర్చలు మొదలుపెట్టారు. ఈ కుట్రలను కేసీఆర్‌ తన రాజకీయ వ్యూహ చతురతతో బద్దలు కొట్టారు. చిన్నరాష్ట్రమైనా తెలంగాణలో రాజకీయ సుస్థిరత, అభివృద్ధి సాధ్యమేనని నిరూపించారు.

తెలంగాణే ఆశగా.. తెలంగాణే శ్వాసగా!
నాయకులు సాధారణంగా ప్రవృత్తి రీత్యా రాజకీయాల్లోకి వస్తారు. కష్టపడో, అవకాశాలు, అదృష్టం కలసివచ్చో, యాదృచ్ఛికంగానో పదవులు పొందుతారు. కానీ ఒక నిర్దిష్ట లక్ష్యంతో సుదీర్ఘ కాలంపాటు రాజకీయాలు చేసి, అనుకున్నది సాధించి చూపే వారు ప్రపంచ చరిత్రలో ఎంతో అరుదు. అలాంటి అరుదైన నాయకుడు కేసీఆర్‌. 1978లో యువజన నాయకుడిగా రంగప్రవేశం చేసిన ఆయన, 2001 దాకా సాధారణ రాజకీయాల్లో కొనసాగినప్పటికీ, ఆయన మనసు తెలంగాణ కోసం పరితపిస్తూనే ఉండేదన్న సంగతి ఆయనతో సన్నిహితంగా ఉన్న అనేకమందికి తెలుసు. ఇక 2001 నుంచి అయితే ఆయన కేవలం ‘తెలంగాణ’ కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. 2001 నుంచి 2014 దాకా 13 ఏండ్ల పాటు తెలంగాణ సాధన కోసం ఉద్యమం నడిపిన ఆయన, తాను సాధించుకొచ్చిన తెలంగాణలో 2014 నుంచి నేటి దాకా అభివృద్ధి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత తదేక దీక్షతో, అకుంఠిత సంకల్పంతో ఒకే అంశానికి కట్టుబడి ఉండడం, చివరికి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడడం అరుదు. నిర్దిష్ట లక్ష్య (ప్రత్యేక రాష్ట్రం) సాధన కోసం పార్టీ పెట్టి, దాన్ని సాధించి, సాధించిన దాన్ని అభివృద్ధి కూడా చేసుకొనే అవకాశం కొందరికే దక్కుతుంది, అలా దక్కిన అరుదైన నాయకుడు కేసీఆర్‌! ఈ విషయంలో కేసీఆర్‌కు సాటి వచ్చేవారు తెలుగు నాయకుల్లో ఎవరూ లేరు.

కేసీఆర్‌ పొలిటికల్‌ జర్నీ
1978లో యువజన నాయకునిగా రాజకీయరంగ ప్రవేశం
1983లో సిద్దిపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ (877 స్వల్ప ఓట్ల తేడాతో మదన్‌మోహన్‌ చేతిలో ఓటమి)
1985లో ఎమ్మెల్యేగా విజయం (డిప్యూటీ మంత్రి హోదాలో కరువు పనుల ప్రత్యేక ప్రతినిధిగా నియామకం)
1989, 1994, 1996లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం
1996లో (టీడీపీ ప్రభుత్వంలో కేబినెట్‌ హోదాలో రవాణా మంత్రి)
1999లో ఎమ్మెల్యేగా విజయం (అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌)
2001లో ఏప్రిల్‌ 21న ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ పదవులకు రాజీనామా
2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ రాష్ర్ట సమితి ఏర్పాటు
2004 లోక్‌సభ ఎన్నికలలో కరీంనగర్‌ నుంచి ఎంపీగా విజయం
2004 నుంచి 2006 వరకు కేంద్ర కార్మికశాఖ మంత్రి
2006, 2008లో కరీంనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం
2009లో మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా విజయం
2009, నవంబర్‌ 29న తెలంగాణ రాష్ర్టం కోసం ఆమరణ దీక్ష (తెలంగాణ ఉద్యమంలో చారిత్రక ఘట్టం)
2009 డిసెంబర్‌ 9న, తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుపై కేంద్రం ప్రకటన (ఆ తర్వాత ప్రకటన వెనక్కి)
2010 నుంచి 2014 వరకు వివిధ రూపాలలో ఉద్యమం ఉద్ధృతం
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘన విజయం
2014, జూన్‌ 2న తెలంగాణ ఏర్పాటు (తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం)
2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలలోనూ టీఆర్‌ఎస్‌ ఘన విజయం (రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం)

దక్షిణాదిలోనే సుదీర్ఘకాలం!
దీంతోపాటే సీఎం కేసీఆర్‌ మరో రికార్డు కూడా సృష్టించబోతున్నారు. యావత్‌ దక్షిణాది రాష్ర్టాల్లోనే ఏకబిగిన సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన ఘనతనూ ఆయన త్వరలో సొంతం చేసుకోబోతున్నారు. దక్షిణాదిలో నిరంతరాయంగా సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన రికార్డు తమిళనాడు అగ్రనేత కామరాజ్‌నాడార్‌ పేరిట ఉన్నది. 1954 ఏప్రిల్‌ 13 నుంచి, 1963 అక్టోబరు 2 దాకా తొమ్మిదేండ్ల ఐదు నెలలపాటు కామరాజ్‌ మద్రాస్‌ స్టేట్‌ సీఎంగా ఉన్నారు. తెలంగాణలో డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆర్నెల్ల కాలాన్ని కూడా కలుపుకొంటే కేసీఆర్‌ 9 ఏండ్ల ఆరునెలల పాటు సీఎంగా ఉంటారన్నమాట. అంటే యావత్‌ దక్షిణాదిలో ఏకబిగిన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ రికార్డు సృష్టించనున్నారు. దీంతో పాటు మరో అపూర్వమైన, అద్వితీయమైన విజయమూ కేసీఆర్‌, ఆయన పార్టీ బీఆర్‌ఎస్‌ ముంగిట నిలవబోతున్నది.

డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయభేరి ఖాయమని సర్వేలు ఘోషిస్తున్నాయి. విపక్షాలకు చెందిన అగ్రనేతలు కూడా ఈసారి మళ్లీ కేసీఆరే అని బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా మూడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించినట్టు అవుతుంది. 58 ఏండ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోగానీ, 70 ఏండ్ల తెలుగు వారి ప్రత్యేక ప్రస్థానంలోగానీ, ఒక పార్టీ వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, హ్యాట్రిక్‌ కొట్టడం ఇదే తొలిసారి అవుతుంది. పేరుగొప్ప జాతీయ, ప్రాంతీయ పార్టీలు వేటికీ ఇప్పటిదాకా ఈ ఖ్యాతి దక్కలేదు. మొత్తం దక్షిణాదిని పరిశీలిస్తే, అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట కాంగ్రెస్‌ కర్ణాటకలో ఒకసారి (1952,1957, 1962,1967), తమిళనాడులో ఒకసారి (1952,1957,1962) హ్యాట్రిక్‌ విజయాలు సాధించగలిగింది. స్వాతంత్య్ర సమరానికి సారథ్యం వహించిన పార్టీగా ఉన్న పేరు ప్రతిష్ఠలు, ప్రత్యర్థి పక్షం లేకపోవడం అప్పుడు దానికి ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. పోటాపోటీగా భీకర రాజకీయాలు సాగుతున్న నేటి కాలంలో ఒక పార్టీ హ్యాట్రిక్‌ విజయాలు సాధించడం అనేది మామూలు సంగతి కాదు. టీఆర్‌ఎస్‌ ఆ ఘనత సాధించే అవకాశాలూ పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Latest News

More Articles