Friday, May 17, 2024

దరఖాస్తుల అమ్మకాలపై.. సీఎం రేవంత్ రెడ్డి స్పందన

spot_img

ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని సీఎం అన్నారు.

ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.

దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టంగా సూచించారు

Latest News

More Articles