Saturday, May 18, 2024

ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్‌ నిర్మాణం : సీఎం రేవంత్‌రెడ్డి

spot_img

దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత..? అందులో ఉన్న భవనాలు, వాటిస్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాసగృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని సీఎం అన్నారు. అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం భవన్ మ్యాప్‌ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు చేశారు

Latest News

More Articles