Sunday, May 19, 2024

కండ‌క్ట‌ర్ కుటుంబానికి రూ.50ల‌క్ష‌ల అంద‌జేత‌

spot_img

హైదరాబాద్: రోడ్డు ప్ర‌మాదంతో విషాదం అలుముకున్న కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది. విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన కండక్టర్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్‌ బొల్లం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జ‌గిత్యాల నుంచి వ‌రంగ‌ల్ వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ బ‌స్సును రాంగ్ రూట్‌లో వ‌చ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మ‌ల్యాల-బ‌ల‌వంతాపూర్ స్టేజీ వ‌ద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండ‌క్ట‌ర్ కుటుంబంలో విషాదం అలుముకుంది.

ఈ ఆప‌ద స‌మ‌యంలో యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు బాధిత కుటుంబానికి అక్క‌ర‌కొచ్చింది. సిబ్బంది, ఉద్యోగుల సాల‌రీ అకౌంట్స్‌ను ఇటీవ‌ల యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చింది. ఆర్థిక ప్ర‌యోజ‌నంతో కూడిన సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్‌, రూపే కార్డు తీసుకోవాల‌ని ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. సంస్థ‌లోని ఉద్యోగులంద‌రూ వారు నివ‌సిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు.

ఈ ఖాతా, కార్డు ద్వారా ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం ఉండ‌టంతో ఉద్యోగుల‌కు ఎంతో ఆర్థిక ప్ర‌యోజ‌నం చేకూరుతోంది. ప్ర‌మాదాలు జ‌రిగిన స‌మ‌యంలో సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేత‌నం ప్ర‌కారం) క‌నీసం రూ.40ల‌క్ష‌లు, రూపే కార్డు కింద మ‌రో రూ.10ల‌క్ష‌లను యూబీఐ అందజేస్తోంది.

ఈ మేర‌కు రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన జ‌గిత్యాల డిపో కండక్ట‌ర్ బొల్లం స‌త్త‌య్య కుటుంబానికి రూ.50 లక్షల విలువైన 2 చెక్కుల‌ను యూబీఐ అధికారులతో కలిసి సంస్థ  ఎండీ వీసీ సజ్జనర్‌ మంగ‌ళ‌వారం బ‌స్‌భ‌వ‌న్‌లో అంద‌జేశారు. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండ‌క్ట‌ర్ సత్తయ్య భార్య బొల్లం పుష్ఫ‌తో పాటు కొడుకు ప్ర‌వీణ్ కుమార్‌, కూతురు మాధ‌వీల‌త‌ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

Latest News

More Articles