Saturday, May 18, 2024

శ్మశానం కబ్జా చేసిన కాంగ్రెస్‌ నేత.. న్యాయం చేయాలన్న వారిపై ఉల్టా కేసు

spot_img

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక కాంగ్రెస్‌ నేతకు, దళితులకు మధ్య భూ వివాదం రాజుకున్నది. తరతరాలుగా తాము వినియోగిస్తున్న శ్మశానవాటికను ధ్వంసం చేసి, దానిని చదును చేశారంటూ ఇప్పటూరుకు చెందిన దళితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ తొలుత రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అయితే అది తమ పరిధిలోకి రాదంటూ రెండు మండలాల తహసిల్దార్‌లు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో దళితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

మరోవైపు సదరు కాంగ్రెస్‌ నేత ఫిర్యాదు మేరకు శ్మశానవాటిక పరిరక్షణ కోసం పోరాడుతున్న దళితులపై పోలీసులు ఉల్టా కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం ఇప్పటూరు గ్రామ శివారులోని వాగు వెంట ఉన్న సుమారు ఎకరం భూమిని దళితులు కొన్నేండ్లుగా శ్మశానవాటికగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే సుమారు 40 నుంచి 50 మృతదేహాలను అక్కడ పూడ్చిపెట్టారు.

Read Also: ఒడిశాలో కలరా కేసులు.. ఆరుగురు మృతి

ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో సైతం దళితుల శ్మశాన వాటికగానే నమోదై ఉన్నది. కాగా వారం క్రితం రాజాపూర్‌ మండలం దోండ్లపల్లికి చెందిన కాంగ్రెస్‌ నేత కత్తెర కృష్ణయ్య తన అనుచరులతో ఒక జేసీబీని తీసుకొచ్చి శ్మశానవాటికను ధ్వంసం చేశాడని, ఆ భూమిని చదును చేశాడని దళితులు ఆరోపిస్తున్నారు. ఈ శ్మశానవాటికకు ఆనుకుని ఉన్న 16 ఎకరాల గైరాన్‌ భూమిని కత్తెర కృష్ణయ్య గతంలోనే పట్టా పొందినట్టు సమా చారం. కృష్ణయ్యపై చర్య తీసుకోవాలంటూ కోడగంటి మహేశ్వర్‌ తదితరులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

తహసిల్దార్‌ సూచన మేరకు రెవెన్యూ, మై నింగ్‌ శాఖల అధికారులు ఈ భూమిని సర్వే చేసేందుకు వచ్చారని, అయితే, ఒక ప్రజాప్రతినిధి ఫోన్‌ చేయడంతో వారు వెనుదిరిగి పోయారని దళితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘ఇది రెండు మండలాల సరిహద్దు ప్రాంతం. మళ్లీ వస్తాం’ అంటూ అధికారులు వెళ్లిపోయారని దళితులు చెప్తున్నారు. చివరకు ఈ శ్మశానవాటిక రాజాపూర్‌ మండలం పరిధిలోకి వస్తుందని తహసిల్దార్‌ నివేదిక ఇచ్చారు. మరోవైపు అకారణంగా తన పొలంపైకి వచ్చారంటూ పలువురు దళితులపై కాంగ్రెస్‌ నేత కృష్ణయ్య రాజాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read Also: ఐపీఎల్‎లో ఏడు కోట్లు పలికిన కొత్త కుర్రాడు..

దీంతో శ్మశానవాటిక పరిరక్షణ కోసం పోరాడుతున్న కోడుగంటి మహేశ్వర్‌, ఇస్తారయ్య, చంద్రయ్య, బుర్ర బుడ్డయ్య, లక్ష్మయ్య, యాదయ్యపై రాజాపూర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ జారీ చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరురెడ్డి ప్రోద్భలంతోనే పోలీసులు తమపై కేసులు నమోదు చేశారని దళితులు ఆరోపిస్తున్నారు. మంగళవారం రాజాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి శ్మశాన వాటికను ధ్వంసం చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరోవైపు దళితుల ఫిర్యాదు మేరకు సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

Latest News

More Articles