Sunday, May 19, 2024

నీట్‌ కౌన్సెలింగ్‌.. కేంద్రం తీరుపై విమర్శలు

spot_img

హైదరాబాద్‌: నీట్‌ కౌన్సెలింగ్‌ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) అనవసర జాప్యంతో విద్యార్థులు అయోమయం అవుతున్నారు. మెడికల్‌ సీట్ల విషయంలో రాష్ట్రాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ‘నీట్‌’ను తీసుకొచ్చి కర్రపెత్తనం చేస్తుంది. ఇప్పుడు కౌన్సెలింగ్‌ను కూడా తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేయడంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

నీట్‌ ఫలితాలు విడుదలై ఐదు రోజులు గడుస్తున్నా ఎన్‌ఎంసీ కౌన్సెలింగ్‌ ఊసెత్తకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతంది. ఎంబీబీఎస్‌ సీట్లకు ఈ ఏడాది దేశవ్యాప్తంగా ‘కామన్‌ కౌన్సెలింగ్‌’ నిర్వహిస్తామంటూ విచిత్ర ప్రతిపాదన తీసుకొచ్చి గెజిట్‌ కూడా విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం మెడికల్‌ కాలేజీల్లోని 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు కేంద్రం కౌన్సెలింగ్‌,  మిగతా 85 శాతం సీట్లకు రాష్ట్రాల మెడికల్‌ యూనివర్సిటీలు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ద్వారా కౌన్సెలింగ్‌ జరుగుతుంది. అయితే, కోర్టు ఆదేశాలతోనే  కామన్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని తీసుకొస్తున్నామంటూ కేంద్ర వైద్యారోగ్యశాఖకు చెందిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) పైకి చెబుతున్నా వాస్తవం మరోలా ఉందని నిపుణులు అంటున్నారు.

అయితే, ఎన్‌ఎంసీ వాదన విచిత్రంగా ఉందని,  దేశంలోని భిన్న రిజర్వేషన్ల వ్యవస్థల కారణంగా దీనిని అమలు చేయడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కన్వీనర్‌ కోటాలో సీట్లను బ్లాక్‌ చేసే అవకాశమే లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం మేనేజ్‌మెంట్‌ కోటాలోనే ఇలాంటి అవకాశం ఉంటుందని వారు అంటున్నారు. ఎంసీసీ సీట్లను కేటాయిస్తే.. అడ్మిషన్‌ ప్రక్రియ, సర్టిఫికెట్ల పరిశీలన వంటి కీలక బాధ్యతలను కాలేజీల ప్రిన్సిపాళ్లకు వదిలేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జారీ అయిన సర్టిఫికెట్లను పరిశీలించి, అవి నిజమైనవో కాదో తేల్చే శక్తి ఉంటుందా? ఎన్‌ఎంసీ ఇందుకోసం ఏమైనా ఏర్పాట్లు చేస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  అనేక రాష్ట్రాలు సర్టిఫికెట్లను స్థానిక భాషల్లో ఇస్తుండగా.. కామన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే కాలేజీ ప్రిన్సిపాళ్లు వాటిని ఎలా పరిశీలిస్తారన్నది నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

దీంతోపాటు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ అమల్లో ఉండగా.. కర్ణాటకలో ఇటీవలే రద్దు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కోటా అంటూ ప్రత్యేకంగా లేదు. మరోవైపు కొన్ని కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నాయి. ఇలాంటి స్థానిక సమస్యలను ఎంసీసీ ఎలా పరిష్కరిస్తుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా కామన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని,  ‘రాష్ర్టాల్లో కామన్‌ కౌన్సెలింగ్‌’ నిర్వహించాలని మాత్రమే సూచించిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ కేంద్రం దీనిని వక్రీకరించి రాష్ట్రాల హక్కును హరించేందుకు ప్రయత్నిస్తున్నదని వారు మండిపడుతున్నారు.

Latest News

More Articles