Saturday, May 18, 2024

ఢిల్లీ హైకోర్టులో ఎంఎస్ ధోనీపై పరువు నష్టం దావా

spot_img

టీంఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై పరువునష్టం దావా నమోదైంది. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని, తమ పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ.. ధోనీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన మాజీ బిజినెస్ పార్టనర్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. క్రికెట్‌ అకాడమీ విషయంలో మాజీ వ్యాపార భాగస్వాములు తనను రూ. 15 కోట్ల మేర మోసం చేశారంటూ టీంఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కా స్పోర్ట్స్‌ డైరెక్టర్స్ మిహిర్‌ దివాకర్‌, సౌమ్య దాస్‌లు తాజాగా మహీపై పరువు నష్టం దావా వేశారు. తమపై అవాస్తవాలను ప్రచారం చేయకుండా.. సోషల్ మీడియా, మీడియా సంస్థలను నిలువరించాలని కోరారు. పిటిషన్ దారుల అభ్యర్థనపై హైకోర్టు జనవరి 18న విచారణ జరపనుంది.

Read Also: రూ.500నోటుపై గాంధీకి బదులు రాముడి ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్

ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ సంస్థ 2017లో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ ధోనీతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం… ఫ్రాంఛైజీ ఫీజు, లాభాల్లోని వాటాను ధోనీకి చెల్లించాల్సి ఉంటుంది. అయితే షరతులను పాటించడంలో కంపెనీ విఫలమవడంతో ధోనీ వైదొలిగాడు. ఆపై తనకు రావాల్సిన చెల్లింపులపై కోర్టును ఆశ్రయించాడు. కంపెనీ డైరెక్టర్స్ మిహిర్‌ దివాకర్, ఆయన భార్య సౌమ్య దాస్‌పై క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఇటీవల టీంఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. ఆర్కా స్పోర్ట్స్‌ చేసిన మోసం కారణంగా ధోనీ రూ.15 కోట్ల మేర నష్టపోయాడని తెలిపారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని తాజాగా దివాకర్‌ కొట్టిపారేశారు. కేసు కోర్టులో ఉండగానే ధోనీ తరఫు న్యాయవాది ప్రెస్‌మీట్‌ పెట్టడాన్ని తప్పుబట్టారు. ధోనీ తమ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ పరువు నష్టం దావా వేశారు.

Latest News

More Articles