Saturday, May 18, 2024

మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి

spot_img

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(78) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ప్రస్తుతం పరిగి పట్టణంలో నివాసముంటున్నారు. కాగా.. శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సీపీఆర్ చేసిన శరీరం సహకరించలేదని వైద్యులు తెలిపారు.

హరీశ్వర్‌రెడ్డి 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికలలో పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి పరిగి ఉపసర్పంచ్‌గా, 1978లో సర్పంచ్‌గా, సమితి వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బీఆర్ఎస్‎లో చేరారు. కాగా.. హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో నిర్వహించనున్నారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేశ్‌రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

కాగా.. హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పరిగి నియోజకవర్గం నుంచి పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానం పొందిన సీనియర్ రాజకీయ నేతగా, మంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. హరీశ్వరరెడ్డి కుమారుడు, పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Latest News

More Articles