Monday, May 13, 2024

కర్ణాటకలో ‘ఉచిత బస్సు’కు నిధుల కష్టాలు.. మరి తెలంగాణలో ఎన్నాళ్లు సాగేనో?

spot_img

ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ పలు హామీలను గుప్పించింది. అటు కర్ణాటకలో ఇచ్చినట్లే.. తెలంగాణలో కూడా కొన్ని హామీలను ఉన్నవి ఉన్నట్లు దింపింది. అందులో ముఖ్యమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కర్ణాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఈ హామీని ప్రజలలోకి బాగా తీసుకెళ్లింది. ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వ ఏర్పాటు చేసిన తర్వాత జూన్ 11న ‘శక్తి పథకం’ పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఆ ‘శక్తి’ స్కీమ్‌కు నిధుల కటకట మొదలైంది. అంతేకాకుండా.. బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య కూడా ఎక్కువ కావడంతో.. పురుషులు బస్సు ఎక్కేందుకు విముఖంగా ఉన్నారు. దాంతో అటు మహిళల నుంచి టికెట్ డబ్బులు రావడం లేదు, ఇటు టికెట్ కొనుగోలు చేసే పురుషులు బస్సు ఎక్కక పోవడంతో ఆర్టీసీ ఆదాయం రెండు విధాల తగ్గిపోతోంది.

Read Also: కేసీఆర్ ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్‎గా ఉన్నారు.. యశోద వైద్యులు

ఈ పథకం అమలు కోసం సిద్ధరామయ్య సర్కారు బడ్జెట్‌లో రూ. 2,800 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు ఈ నిధులను వినియోగించనున్నట్టు వెల్లడించింది. అయితే ‘శక్తి’ స్కీమ్‌ కోసం కేటాయించిన బడ్జెట్‌లో ఇప్పటికే రూ.2,143 కోట్లు ఖర్చయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా నిధులు వచ్చే డిసెంబర్‌ వరకు మాత్రమే సరిపోతాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం గనుక వెంటనే నిధులు విడుదల చేయకపోతే, బస్సులు నడుపడమే కష్టమని తేల్చి చెప్తున్నారు. అయితే ఈ పథకం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.4,400 కోట్లు ఖర్చవుతుందని కేఎస్ఆర్టీసీ అంచనా వేస్తోంది. దాంతో ఈ పథకాన్ని కొనసాగించాలా? వద్దా? అనే ఆలోచనలో పడింది.

ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని శనివారం ప్రారంభించారు. తెలంగాణలో కూడా కర్ణాటక మోడల్‌నే అమలు చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే ఏడాదికి రూ.2,200 కోట్లు, పల్లెవెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా రూ.750 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మన రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం వల్ల ఆర్టీసీ కోల్పోయే టికెట్‌ ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీ బస్సులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తే ఏడాదికి రూ.2200 కోట్ల వరకు రీయింబర్స్‌ చేయాలి. అంటే ప్రతి నెలా రూ.185 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

Read Also: ఎమ్మెల్యే వెడ్స్ ఐఏఎస్‌.. లక్షల మందికి ఆహ్వానం

ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తమిళనాడు, కర్ణాటకలో టీఎస్‌ఆర్టీసీ ఐదుగురు అధికారుల బృందం పర్యటించింది. ఆ రాష్ట్రాల్లో ఉచిత ప్రయాణం ఏయే క్యాటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడుతుందనే దానిపై అధ్యయనం చేసింది. కర్ణాటకలో ఈ పథకం కోసం ఎంత ఖర్చు అవుతున్నది? దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తున్నది? వంటి విషయాలను పరిశీలించారు. ఒకవేళ మన దగ్గర కూడా నిధుల కొరత ఏర్పడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఉంచుతుందో లేక తీసేస్తుందో చూడాలి.

Latest News

More Articles