Friday, May 17, 2024

గోద్రెజ్@250కోట్లు.. తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి..!

spot_img

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ కంపెనీలు త‌మ కార్య‌క‌లాపాల‌ను రాష్ట్రంలో ప్రారంభించ‌గా, తాజాగా గోద్రెజ్ సంస్థ తెలంగాణ‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఖ‌మ్మం, కొత్త‌గూడెం జిల్లాల్లో వంట నూనెల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం రూ. 250 కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు గోద్రెజ్ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌తో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బ‌ల‌రాం సింగ్ యాద‌వ్ స‌మావేశ‌మై పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు తెలిపారు. ఖ‌మ్మం, కొత్త‌గూడెం జిల్లాల్లో ప్ర‌త్య‌క్షంగా 250 మందికి, ప‌రోక్షంగా 500 మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి.

తెలంగాణ ప్ర‌భుత్వ పాల‌సీలు అద్భుతంగా ఉన్నాయ‌ని గోద్రెజ్ సంస్థ ప్ర‌శంసించింది. ఫ్యాక్ట‌రీ ఏర్పాటుతో పాటు పామాయిల్ రైతుల కోసం 10 గోద్రెజ్ స‌మాధాన్ సెంట‌ర్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు గోద్రెజ్ కంపెనీ తెలిపింది. 2025 – 26 వరకు ప్లాంటును పూర్తి స్థాయిలో నడపాలని భావిస్తున్న గోద్రెజ్ సంస్థ… గంటకు 30 టన్నుల ప్లాంటును ప్రతిపాదిస్తోంది. దాన్ని గంటకు 60 టన్నుల సామర్థ్యానికి కూడా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థ పెడుతున్న పెద్ద పెట్టుబడి ఇదే కానుంది. గోద్రెజ్ సంస్థ పెట్టుబడిని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఆయిల్ పామ్ సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన శ్రద్ధ ఫలితాలను ఇస్తోందని అన్నారు.

Latest News

More Articles