Friday, May 3, 2024

ఇప్పటిదాకా పుర ప్రగతికి 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినం

spot_img
  • తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలంటే ఇతర రాష్ట్రాలను ఒకసారి పరిశీలించి రావాలి.
  • ప్రతి ఏటా ఫిబ్రవరి 24వ తేదీన పట్టణ ప్రగతి దినోత్సవం
  • ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులకు పట్టణ ప్రగతి దినోత్సవం నాడు అవార్డుల ప్రదానం

హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఈ దిశగా నిబద్ధతతో కూడిన ప్రయత్నాన్ని ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, అన్ని పురపాలికల మున్సిపల్ కమిషనర్లతో హైదరాబాద్ లో నిర్వహించిన వర్క్ షాప్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా పట్టణాల అభివృద్ధిపై కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. పురపాలక శాఖ, దాని అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో హైదరబాద్ కాకుండా మిగతా పట్టణాలలో వివిధ అభివృద్ధి పనుల కోసం ఎనిమిది సంవత్సరాలుగా సుమారు 16 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

పట్టణాల అభివృద్ధి కోసం చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఇంత భారీగా నిధులను కేటాయించడం గొప్ప విషయం అన్న కేటీఆర్, దేశంలో మరే రాష్ట్రం తెలంగాణ లెక్క నిధులను కేటాయించలేదనడం అతిశయోక్తి కాదన్నారు. ఒకవైపు పరిపాలన సంస్కరణలు, నూతన చట్టాలు, నిరంతరం నిధుల వంటి అనేక పద్ధతుల్లో పట్టణాలను అభివృద్ధి చేస్తున్నమని తెలిపారు.

తమపై అత్యంత సులువుగా రాజకీయ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కచ్చితంగా గుర్తించాల్సిన అనివార్యతలో ఉన్నాయన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ఎంపిక కాబడే  ఉత్తమ గ్రామపంచాయతీలు, ఉత్తమ పట్టణాలు, ఉత్తమ జిల్లాలన్నీ తెలంగాణలోనే ఉంటున్నాయన్న సంగతి తాజాగా కేంద్రం ప్రకటించిన అత్యుత్తమ జిల్లా ర్యాంకులతోనూ మరోసారి నిరూపితమైందన్నారు.

పురపాలక పట్టణాల్లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఎవరు కాదనలేరని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలంటే ఇతర రాష్ట్రాలను ఒకసారి పరిశీలించి రావాలని సూచించారు. అప్పుడే మాత్రమే తెలంగాణలో జరిగిన మౌలిక వసతుల కల్పన స్పష్టంగా అర్థమవుతుందన్నారు కేటీఆర్.

తెలంగాణ పురపాలక శాఖను దేశంలోనే అత్యుత్తమ శాఖగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం తనకున్నదన్న కేటీఆర్, ఈ దిశగా ఉద్యోగులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. తాము పనిచేస్తున్న సంస్థలో, విభాగంలో ఏదో ఒక మార్పును తీసుకువచ్చామన్న సంతృప్తిని రిటైర్మెంట్ రోజు పొందినప్పుడే జీవితంలో అసలైన విజయం సాధించినట్టు అని కేటీఆర్ చెప్పారు.

పురపాలక శాఖలోని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సైతం త్వరలోనే పూర్తి అవుతుందన్న కేటీఆర్, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి వార్డుకొక పురపాలక అధికారిని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నామని ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు.

Latest News

More Articles