Sunday, May 19, 2024

న్యూయార్క్‌‎లో భారీ వరదలు.. ఎమర్జెన్సీ విధించిన గవర్నర్

spot_img

భారీగా కురుస్తోన్న వర్షాలు, వరదలతో అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. వర్షం కారణంగా పోటెత్తిన వరదలతో సబ్‌వేలు, అపార్ట్‌మెంట్లు పూర్తిగా నీట మునిగాయి. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారులు, వీధులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోని భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాంతో గవర్నర్‌ క్యాథి హోచుల్‌ న్యూయార్క్‌ నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సబ్‌వేలు, ఎయిర్‌పోర్టుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో తాత్కాలికంగా వాటిని మూసివేశారు. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కుండపోతగా కురుస్తోన్న వర్షాలతో వరదల ఉద్ధృతి మరింత పెరిగే అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇళ్ల నుంచి ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

Latest News

More Articles