Friday, May 3, 2024

బీజేపీలో వర్గపోరు.. చేతులెత్తేసిన బండి సంజయ్‌

spot_img

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పలికే బీజేపీ.. పరిగెత్తడం అటుంచి కనీసం నడవలేక బొక్కబోర్లా పడింది. పార్టీలో రోజురోజుకూ వర్గపోరు పెరుగుతున్నది. నలుగురు ఎంపీలు నాలుగు దిక్కులుగా వ్యవహరిస్తుండగా.. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకరి ముఖం ఒకరు చూసుకొనే పరిస్థితి లేదు. దీంతో వాపును చూసి బలుపు అనుకొని విర్రవీగిన ఆ పార్టీ ఇప్పుడు గల్లీ నుంచి రాష్ట్రస్థాయి దాకా కకావికలం అయ్యింది. సీనియర్లు అలకల మీద ఉండగా, జూనియర్లు అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. అందరినీ ఒక్కతాటిమీదికి తేవాల్సిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేతులెత్తేశారు. సిల్లీ విమర్శలు, చీప్‌ పాలిటిక్స్‌తో జనాల్లో చులకన అవుతున్నారు. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతున్నదో తెలియక ఢిల్లీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.

ఎవరికివారే యమునా తీరే!
బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు ఎవరికివారే యమునా తీరేలా వ్యవహరిస్తున్నారు. ఒంటెత్తు పోకడలు, నియంతృత్వ ధోరణితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పార్టీని బంగాళాఖాతంలో ముంచేశారు. ఇక సోయం బాపూరావ్‌ అనే ఓ ఎంపీ బీజేపీలో ఉన్నాడనే విషయం ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలకు తెలియదు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో అడుగు పెట్టక నెలలు గడుస్తున్నది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి కేంద్ర మంత్రులు వచ్చినా బాపురావ్‌ హాజరుకారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్లినా కనీసం పట్టించుకోరు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తన దారి తనదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరూ హామీ ఇవ్వకపోయినా ఆర్మూర్‌ నియోజకవర్గంలో తనే అభ్యర్థిని అని ప్రకటించుకోవడం, బండి దానిని ఖండించడంతో ఇద్దరి మధ్య వైరం మొదలయ్యింది.

మరో ఎంపీ కిషన్‌రెడ్డిది ప్రత్యేక వైఖరి. పార్టీతో తనకు సంబంధమే లేనట్టు, కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. బీజేపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుండగా రాజాసింగ్‌ను ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారు. ఈటల రాజేందర్‌ తనకు అధ్యక్ష పదవి వస్తుందని, ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని ఆశలు పెట్టుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు. బండి తనను విఫల నేతగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. పార్టీ పెద్దలు హుటాహుటిన శుక్రవారం ఈటలను ఢిల్లీకి పిలిచారు. దు బ్బాక ఎమ్మెల్యే మిగ తా వారితో పెద్దగా కలవడం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

అలకలు..లుకలుకలు
బీజేపీలో చెప్పుకోదగ్గ నేతలంతా అలకల మీదే ఉన్నారు. డీకే అరుణ హైదరాబాద్‌కు, పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడమే మానేశారు. విజయశాంతి ఎప్పటి నుంచో బండిపై గుర్రుగా ఉన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి వంటి నేతలదీ దాదాపు ఇదే దారి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీని విడిచి కాంగ్రెస్‌కు ఎంత మంది పోతారోనని ఆ పార్టీ పెద్దలు దినదినగండంగా గడుపుతున్నారు.

Latest News

More Articles