Saturday, May 4, 2024

దేశ చరిత్రలో అత్యంత బలహీన ప్రధాని మోడీ

spot_img

స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి మోడీ అని ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పాట్నాలో విపక్షాలు నిర్వహించిన సమావేశంపై స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఈ దేశానికి తీరని నష్టం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలు, ఆ పార్టీలతో నిర్వహించే సమావేశాలు, వాటి కార్యకలాపాలకు దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్‌, బీజేపీ ఘోరంగా విఫలం అయ్యాయని విమర్శించారు. దేశంలో ఇప్పటికీ విద్యుత్తు, నీటి సరఫరాలేని గ్రామాలు ఉన్నాయంటే అందుకు బాధ్యత పూర్తిగా ఆ రెండు పార్టీలదేనని చెప్పారు. అంశాలవారీగా ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు.

ప్రధాని మోడీ బలహీనతలను దేశంలో అందరి కంటే ఎక్కువగా ఎండగట్టింది బీఆర్‌ఎస్సేనని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కేంద్రం చేతుల్లోకి తీసుకునే ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ ఉభయసభల్లో ఓటు వేస్తామని తెలిపారు. రాష్ర్టాలకు, ప్రజలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా తిప్పికొడతామని స్పష్టంచేశారు. రాష్ర్టాల హక్కులను కాల రాస్తే కేంద్రంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్‌ ఏవిధంగా సపోర్టు చేస్తున్నదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోదీకి అవకాశం ఇస్తే ఢిల్లీని కూడా గుజరాత్‌లో కలిపేస్తారని ఎద్దేవా చేశారు.

దేశమంతా తెలంగాణ నమూనా
తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్స్‌ వస్తున్న నేపథ్యంలో అందు కోసం తాము కృషి చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. ఎవరు ఎవరితో కుమక్కు అవుతున్నారనే విషయంలో ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ క్రియాశీల పాత్రపోషిస్తున్నదని కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ మాడల్‌ తమ రాష్ట్రంలోనూ అమలు కావాలని మహారాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని ఉదహరించారు. మహారాష్ట్రలో అన్ని పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరుతుండటమే అందుకు నిదర్శనమని చెప్పారు.

Latest News

More Articles