Monday, May 20, 2024

తెలంగాణ ఎంట్రెన్స్ పరీక్షలకు సర్వసిద్ధం

spot_img

తెలంగాణలో నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. తెలంగాణ సెట్స్ కన్వీనర్లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు సంబంధించి దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 10, 11వ తేదీల్లో ఎంసెట్ అగ్రి అండ్ ఫార్మాకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అదేవిధంగా ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది.

ఎంసెట్‎కు ఇప్పటివరకు మూడు లక్షల 20వేల 587 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఆన్‎లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. మొత్తం 21 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వాహణకు ఏర్పాట్లు చేశాం. తెలంగాణలో 16 పరీక్ష కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‎లో ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇంజనీరింగ్ పరీక్షకు 1,99,548 మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ మరియు మెడిసిన్‎కు 1,1160 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎడ్ సెట్ పరీక్ష ఈ నెల 18న జరుగుతుంది, ఈ పరీక్షకు 29,390 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసెట్ పరీక్ష ఈ నెల 20న జరుగుతుంది. ఈ పరీక్షకు 21,586 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్ లాసెట్ పరీక్ష ఈ నెల 25న జరుగుతుంది. ఈ పరీక్షకు 41,349 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఐసెట్ పరీక్ష ఈ నెల 26, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ పరీక్షకు 43,242 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పీజీ ఈసెట్ పరీక్ష ఈ నెల 29 మరియు వచ్చే నెల 1న జరుగుతుంది. ఈ పరీక్షకు 13,636 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలన్నీ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు గంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతి ఉంటుంది. ఒక నిమిషం నిబంధన అమల్లో ఉంటుంది, కాబట్టి విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఇప్పటికే ఎంసెట్ హాల్ టికెట్లు వెబ్‎సైట్‎లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు డౌన్‎లోడ్ చేసుకొని, పరీక్ష కేంద్రాలను ఒకరోజు ముందుగానే చూసుకోవాలి’ అని ప్రొఫెసర్ లింబాద్రి సూచించారు.

Latest News

More Articles