Saturday, May 18, 2024

కేసీఆర్ ఎన్నికల శంఖారావం.. చేవెళ్ల లో ఇవాళ మొదటి బహిరంగసభ

spot_img

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ చేవెళ్ల వేదికగా ఇవాళ(శనివారం) ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభ కావడంతో నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషిచేస్తున్నారు. 2 లక్షలకు పైగా జనసమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తుచేస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్‌ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపనున్నట్టు తెలుస్తున్నది. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్‌ కాలేజీలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతోపాటు ప్రజలు దూరం నుంచి సభను చూసేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ దళాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేలా బీఆర్‌ఎస్‌ పార్టీ కసరత్తును ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్‌లో జోష్‌ నింపేలా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించారు. చేవెళ్లతోపాటు మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, భువనగిరి, మల్కాజిగిరి పార్లమెంటు స్థానాలతో రంగారెడ్డి జిల్లాకు ఉన్న అనుబంధంతో కేసీఆర్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు.

ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో అధినేత కేసీఆర్‌ అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన గెలుపు వ్యూహాలపై సమాలోచనలు చేశారు. అందరి నేతల ఏకాభిప్రాయం మేరకు చేవెళ్ల జనరల్‌ స్థానంలో బీసీ సామాజికవర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ను వ్యూహాత్మకంగా బరిలో ఉంచారు. అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మరుసటి రోజు నుంచే కాసాని జ్ఞానేశ్వర్‌ నియోజకవర్గాల వారీగా సమావేశాల్లో పాల్గొనడమేకాకుండా ముఖ్యనేతలు, కార్యకర్తలను కలుస్తున్నారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ సమావేశాల్లో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. కాసాని గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిస్తున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీల మధ్య లోపాయికారీ ఒప్పందాలను ప్రజలకు వివరించడంతోపాటు గత పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన తీరును పోల్చిచూసి లోక్‌సభ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ఈ వేదికపై నుంచి కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల తీరుపై ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రజలకు కర్తవ్యబోధ చేయనున్నట్లు సమాచారం. పదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ జనరంజక పాలనను ప్రస్తావిస్తూనే.. తెలంగాణ పట్ల తనకున్న భావోద్వేగ బంధాన్ని ఆవిష్కరించి ప్రజలను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు కేసీఆర్.

ఇది కూడా చదవండి: నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది

Latest News

More Articles