Friday, May 17, 2024

కాంగ్రెస్‌లో ఖమ్మం లొల్లి..!

spot_img

హైదరాబాద్‌: టీ కాంగ్రెస్‌లోని వర్గపోరు ఊపందుకుంది. ఖమ్మంలో జూలై 2న నిర్వహించబోయే సభ కాంగ్రెస్‌లో చిచ్చురేపుతోంది. ఈ సభను పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక కోసం నిర్వహించాలా? లేక సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభగా నిర్వహించాలా? అనే దానిపై టీపీసీసీలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం.

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల వ్యూహం కంటే  ఖమ్మం సభ, టీపీసీసీ నేతల మధ్య కీచులాటలకే పరిమితమైనట్లు తెలుస్తోంది.

రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడలు, పార్టీ నుంచి సీనియర్లను బయటికి పంపేందుకు జరుగుతున్న కుట్రలపై రాహుల్‌ గాంధీ హెచ్చరించినట్టు తెలిసింది. పార్టీ మారుతున్నట్టు తమపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఈ సందర్భంగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

భట్టి పాదయాత్రను తక్కువ చేసి చూపేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని సీనియర్లు ఆరోపించారు. ఖమ్మం సభ ఏ విధంగా నిర్వహించాలన్న దానిపై టీపీసీసీ నేతల మధ్యనే ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్టీ పెద్దలు ఎటూ తేల్చకుండానే అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించినట్టు తెలుస్తోంది. స్ట్రాటజీ మీటింగ్‌ ప్రశాంతంగా జరిగినట్టు బయటికి మాత్రం వెల్లడించడం గమనార్హం.

Latest News

More Articles