Saturday, May 18, 2024

చదువుకునే పిల్లలను ఎంత బాగా చూసుకుంటే.. మన ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుంది

spot_img

హైదరాబాద్: 18 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన నిజాం కాలేజీ బాయ్స్ హాస్టల్ మరియు నూతన కాలేజీ బ్లాక్ నిర్మాణం కోసం మంత్రులు కేటీ రామారావు, సబితా ఇంద్రారెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రలు మహమ్మూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎల్ రమణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘నిజాం కాలేజీలో 1993 నుండి ‌1996 వరకు చదువుకున్నాను. ఇక్కడ చదువుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. యూనివర్సిటీల పరంగా తెలంగాణకు నాలుగవ ర్యాంకు రావడం చాలా సంతోషం. ఈ విషయంలో విద్యశాఖామంత్రికి నా అభినందనలు. ఓయూ వీసీ రవీందర్ యాదవ్ చాలా బాగా పనిచేస్తున్నారు. యూనివర్సిటీని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఉస్మానియా టీవీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో విద్యశాఖా చాలా బాగా పనిచేస్తుంది. నేను, అక్క గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆడపిల్లలు అడిగితే వెంటనే ఒక గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ హాస్టల్ కట్టించి బ్రహ్మాండంగా వాళ్లకు ఇచ్చాం. ఇక్కడ చదువుకోవడానికి అన్ని జిల్లాల నుంచి తెలివితేటలున్న పిల్లలు వస్తారు, టాలెంటెడ్ పిల్లలు వస్తారు. వాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటే.. మన ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా వెంటనే కొత్త ప్రతిపాదన పంపారు. దానికి అనుగుణంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రమే కాకుండా అదనంగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నుంచి 40 కోట్ల 75 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఒక బాయ్స్ హాస్టల్, అదేవిధంగా ఒక పది అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా మనం కట్టుకోబోతున్నాం. మొత్తం కలిపి దాదాపు 74000 స్క్వేర్ ఫీట్ల నిర్మాణంతో పాటు ఇతర పనులు కూడా పూర్తి చేస్తాం’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నిర్మాణం కోసం మా నిధుల తోపాటు మంత్రి కేటీఆర్ HMDA నిధులు కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటిసారి నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్థులకు కూడా హాస్టల్ కల్పించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. యూనివర్సిటీల కోసం 500 కోట్లు ముఖ్యమంత్రి కేటాయించారు, అందుకు వారికి కూడా ధన్యవాదాలు. గురుకులాలు ఏర్పాటు చేసిన తర్వాత ఉన్నత విద్యలో అమ్మాయిల సంఖ్య పెరిగింది. కళ్యాణ లక్ష్మితో వచ్చిన డబ్బును కొంతమంది అమ్మాయిలు ఉన్నత చదువుల కోసం వాడుకుంటున్నారు.

ఓయూ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్
నిజం కాలేజీ చరిత్రలో మొదటిసారి ప్రభుత్వం 32 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పెండింగుల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే బాలికల హాస్టల్ నిర్మాణం పూర్తి అయి.. బాలికలు హాస్టల్‎లో కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు బాలుర కోసం హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో 144 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సైఫాబాద్ పీజీ హాస్టల్ నిర్మాణం పూర్తయింది, త్వరలోనే ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇండియా టుడే సర్వేలో రాష్ట్రలకు సంబంధించిన యూనివర్సిటీలలో ఉస్మానియా 4వ ర్యాంక్ దక్కించుకుంది.

Latest News

More Articles