Tuesday, May 21, 2024

తండ్రి చనిపోయిన రెండు రోజులకే ఎంపీ మృతి

spot_img

తండ్రి చనిపోయిన రెండు రోజులకే కాంగ్రెస్‎కు చెందిన ఓ ఎంపీ చనిపోయారు. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌ బాలు ధానోర్కర్‌ (47) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

మే 26న తీవ్ర కడుపునొప్పితో బాధపడిన ఆయన నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు.. సురేశ్ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దాంతో వెంటనే ఆయనను ఢిల్లీ సరిహద్దులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

కాగా.. రెండు రోజుల క్రితమే ఎంపీ సురేశ్ తండ్రి నారయణ్ ధానోర్కర్ అనారోగ్యంతో మరణించారు. అప్పటికే ఆస్పత్రిలో చేరిన సురేశ్.. తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. కాగా.. గంటల వ్యవధిలోనే ఆయన కూడా మరణించడం సురేశ్ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది.

సురేశ్‌ ధానోర్కరే మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్‌ ఎంపీ కావడం గమనార్హం. బాలాసాహెబ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేశ్‌.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రపూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సురేశ్ భార్య ప్రతిభ కూడా ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2019లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో వరోరా-భద్రావతి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Latest News

More Articles