Sunday, May 19, 2024

మహారాష్ట్రలో కదంతొక్కిన రైతన్నలు.. రైతుబంధు ఇవ్వాలంటూ నిరసనలు

spot_img

మహారాష్ట్రలో తెలంగాణ మాడల్‌ను అమలు చేయాలని ఆ రాష్ట్ర రైతులు నిరసన బాట పట్టారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు తరహాలో ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 22న పర్భణీ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ముందు వేల మంది రైతులు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. మహారాష్ట్ర రైతుల దయనీయ పరిస్థితిపై సర్వే నిర్వహించి, తక్షణం వారిని ఆదుకోకపోతే లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారని ఔరంగాబాద్‌ మాజీ కమిషనర్‌ సునీల్‌ కేంద్రేకర్‌ మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. తెలంగాణ మాడల్‌ను అమలు చేయాలని సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మాడల్‌ను అమలు చేయాలని మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్‌ కదం డిమాండ్‌ చేశారు. మహారాష్ట్ర రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించామని, తమ నిరసనకు అనుమతి కూడా తీసుకున్నామని ఆయన తెలిపారు.

తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు తరహాలో రైతులకు ఎకరానికి రూ.10 వేలు, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచటం, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్‌ను ఇవ్వాలని సునీల్‌ కేంద్రేకర్‌ ప్రభుత్వానికి నివేదించారు. అదే సమయంలో తెలంగాణ తరహా రైతు సంక్షేమం కావాలని అక్కడి రైతులు ఐదారు నెలలుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరిణామాలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కకావికలం చేశాయి. దీంతో కేంద్రేకర్‌పై ఆ సర్కారు అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తూ బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం సకాలంలో ఆదుకోకపోతే సమీప భవిష్యత్తులో లక్ష మంది రైతులు బలవన్మరణానికి పాల్పడతారని హెచ్చరించారు. ఆ సిఫార్సులు రుచించని మహారాష్ట్ర సర్కార్‌ ఆయనను స్వచ్ఛంద పదవీ విరమణ చేసేలా పురికొల్పింది.

Latest News

More Articles