Tuesday, May 21, 2024

అమ్మానానమ్మ చావు బతుకుల్లో ఉన్నారంటూ స్నేహితురాలి నుంచి రూ. 9 లక్షలు స్వాహా

spot_img

అమ్మానానమ్మ చావు బతుకుల్లో ఉన్నారంటూ స్నేహితురాలి నుంచి ఓ యువకుడు రూ. 9 లక్షలు స్వాహాచేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పెద్దపల్లి జిల్లా రేకుండ్లకు చెందిన సాయికుమార్(22) కూకట్ పల్లిలో ఉంటున్నాడు. గతంలో అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేసిన సాయికుమార్.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. దాంతో ఆన్‎లైన్ బెట్టింగ్‎లకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మూడు నెలల కిందట సాయికుమార్‎కి ఇన్‎స్టాగ్రాంలో యూసుఫ్ గూడాకి చెందిన బీటెక్ విద్యార్థిని పరిచయం అయింది. ఇద్దరి మధ్యా స్నేహం పెరగడంతో.. తల్లి, నానమ్మ ఆరోగ్యం బాగాలేదని సాయికుమార్ యువతిని నమ్మించాడు. వారికి వైద్యం చేయించడానికి డబ్బులు లేవని చెప్పాడు. దాంతో ఆ యువతి తన తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో ఉన్న రూ. 9 లక్షల విలువైన బంగారు నగలను పలు విడతలుగా సాయి కుమార్‎కి ఇచ్చింది. సాయికుమార్ ఉద్యోగం చేసే సమయంలో సంపాదించిన డబ్బు, అప్పులు చేసిన డబ్బు, యువతి ఇచ్చిన నగల ద్వారా వచ్చిన డబ్బును కూడా ఆన్‎లైన్ బెట్టింగ్‎లో పెట్టాడు. ఈ విధంగా సాయికుమార్ కేవలం 20 రోజుల్లో రూ. 16 లక్షలు పోగొట్టుకున్నాడు.

కాగా.. ఇంట్లో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో యువతిని ఆమె తల్లి నిలదీసింది. దాంతో యువతి విషయం మొత్తం చెప్పింది. వెంటనే యువతిని తీసుకొని ఆమె తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సాయికుమార్‏ని అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు.

Latest News

More Articles