Saturday, May 18, 2024

మణిపూర్‌లో  రేపు 11 చోట్ల రీపోలింగ్‌

spot_img

లోక్‌సభ తొలిదశ ఎన్నికలు ఈ నెల 19న ముగిశాయి. ఇందులోభాగంగా ఇన్నర్ మణిపూర్  పార్లమెంటు నియోజకవర్గంలోని 11 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడిన దుండగులు కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలకు పాల్పడ్డారు. దీంతో ఆ 11 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 22న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం (EC) నిర్ణయించింది. ఈ విషయాన్ని మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ప్రకటించారు. తొలి దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19న ఈ స్టేషన్లలో జరిగిన ఎన్నికలను లెక్కలోకి తీసుకోలేదని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ రీపోలింగ్ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఖురాయ్ నియోజకవర్గంలోని మొయిరంగ్‌కంపు సాజేబ్, తొంగమ్ లైకై, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని క్షేత్రీగావ్‌లో నాలుగు, థోంగ్జులో ఒకటి, ఉరిపోక్‌లో మూడు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కొంతౌజామ్‌లో ఒక పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరగనుందని చెప్పారు. లోక్‌సభ తొలి దశలో భాగంగా శుక్రవారం మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్‌ స్థానాల్లో 72 శాతం పోలింగ్ నమోదయింది. అయితే కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. మొత్తం 47 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఇన్నర్ మణిపూర్‌లో 36 చోట్ల, ఔటర్ మణిపూర్‌లో 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది.

ఇది కూడా చదవండి: చిలుకూరులో నేటి వివాహప్రాప్తి రద్దు..!

Latest News

More Articles