Friday, May 17, 2024

కిషన్ రెడ్డి వివరాలు తెలుసుకొని మాట్లాడు.. బండికి అవగాహన లేదు

spot_img

జనగామ : కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యనించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వివరాలు తెలుసుకుని, అవగాహనతో మాట్లాడాలని సూచించారు.

కేంద్రంలోని అధికారులను హైదరాబాదుకు తీసుకొస్తే కేంద్ర నిధులు మళ్లింపు వాస్తవమా ? అవాస్తవమా ? రుజువు అవుతుందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు.

సీఎం కేసీఆర్ పాలనాదక్షత

జాతీయ స్థాయిలో తెలంగాణకు అవార్డులు రావడం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపునకు, పాలనాదక్షతకు నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రాష్ట్రానికి అవార్డులను ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తే బాగుంటుందని సూచించారు. జనగామ జిల్లా కంటి వెలుగు రెండో దశ సన్నద్ధత కార్యక్రమం పై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

కేంద్రానికి రూపాయి బకాయి లేదు

కల్లాల కోసం ఖర్చు చేసిన రూ. 150 కోట్లు కేంద్రానికి కడతామని రాతపూర్వకంగా రాసిచ్చిన రాష్ట్రానికి రావలసిన  రూ.1100 కోట్ల నిధులు ఇవ్వడం లేదన్నారు. గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బకాయి లేదన్నారు. కేంద్రం నుంచి సమయానికి నిధులు రాక ఇబ్బంది జరుగుతోందన్నారు. బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడతారని మూతికి, ముక్కుకు తేడా తెలువదని విమర్శించారు.

గుజరాత్ కు ఏ అవార్డులు ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నారని విమర్శించారు. విమర్శలు మాని తెలంగాణకు డబ్బులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కిషన్ రెడ్డిని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి , జిల్లా కలెక్టర్ శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles