Monday, May 20, 2024

గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా.. రాష్ట్రపతిని మోడీ అలాగే పిలుస్తున్నారా?

spot_img

హైదరాబాద్: సచివాలయం ప్రారంభానికి గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగం లో ఉందా.. పార్లమెంటు శంఖుస్థాపనకు ప్రధాని రాష్ట్రపతి ని పిలిచారా.. వందే భారత్ ట్రైన్లను ప్రారంభిస్తున్న ప్రధాని రాష్ట్రపతి ని పిలుస్తున్నారా.. మహిళా గవర్నర్ గా మాకు గౌరవం ఉంది.. కానీ ఆమె తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

ఎమ్మెల్యే పొడెం వీరయ్య వినతి పత్రం ఇచ్చారని గవర్నర్ భద్రాచలం విలీన గ్రామాల బిల్లును ఆపారు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా. వైద్య శాఖలో ప్రొఫెసర్ల  పదవీ విరమణ వయస్సు పెంచడానికి సంబంధించిన బిల్లును గవర్నర్ ఆపారు..ఆ బిల్లులో అభ్యంతర కరమైన అంశాలు ఏమి ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో 65 నుంచి 70 ఏండ్లకు పదవీ విరమణ పెంచారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 70 ఏండ్లకు పదవి విరమణ వయసును పెంచవచ్చని గైడ్ లైన్స్ లోనే ఉంది. వేరే రాష్ట్రాల్లో లేని అభ్యంతరం ఇక్కడ గవర్నర్ కు ఎందుకు అని ప్రశ్నించారు.

ఉమ్మడి జాబితా లో కొన్ని అంశాలు రాష్ట్రం జాబితా లో మరి కొన్ని అంశాలు ఉంటాయి.. వాటి కనుగుణంగా బిల్లులు ఉన్నాయా లేదా అని చూడటం వరకే గవర్నర్ బాధ్యత. సుప్రీం కోర్టులో ఏమైనా కేసులు ఉంటే గవర్నర్ బిల్లులు ఆపొచ్చు..ఈ బిల్లుల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా. పదవీ విరమణ వయస్సు బిల్లును ఏడు నెలలు ఆపడం వాళ్ళ ప్రజలకు నష్టం కలిగించలేదా గవర్నర్. బెంగాల్లో 70 యేండ్లు ఉన్నపుడు ఇక్కడ 65 కు కూడా గవర్నర్ ఒప్పుకోరా. డాక్టర్ అయి ఉండి తమిళి సై ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా చేయడం న్యాయమా.  రాష్ట్ర ప్రయోజనాలకు గవర్నర్ భంగం కలిగించడం లేదా. సుప్రీం కోర్టు లో కేసు వేసే దాకా గవర్నర్ స్పందించలేదు. చివరకు తిరస్కరించి రాష్ట్రపతి కి పంపారని వివరించారు.

ముఖ్యమైన బిల్లులు ఆపడం ద్వారా గవర్నర్ ప్రజలకు విద్య వైద్యం దూరం చేస్తున్నారు. నా ప్రభుత్వం అంటూనే గవర్నర్ వెన్ను పోటు పొడుస్తున్నారు. పిల్లలకు విద్య, నిరుద్యోగ యువత కు ఉద్యోగాలను గవర్నర్ దూరం చేస్తున్నారు. బీహార్ ,ఝార్ఖండ్ ,ఒడిశా ల్లో ఎన్నో యేండ్ల నుంచి యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ నడుస్తోంది. ఇక్కడ గవర్నర్ కు దీనిపై ఎందుకు అభ్యంతరం. నోటితో నవ్వుతూ నొసలితో గవర్నర్ వెక్కిరిస్తున్నారు. గతంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ ఇపుడు అలాంటి బిల్లునే అడ్డుకుంటున్నారు. మహారాష్ట్ర, కర్నాటక ల్లో ప్రైవేట్ యూనివర్సిటీ లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.. అవి బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా. సిద్ది పేటలో వెటర్నరీ కాలేజీ మంజూరు అయ్యింది.. దానికి ప్రొఫెసర్ల కొరత ఉంది. గవర్నర్ ఆ బిల్లును అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ప్రగతి ని అడ్డుకోవడం కాదా అని నిలదీశారు.

జీ 20 కి సంబంధించిన సమావేశాల్లో గవర్నర్ తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా మాట్లాడారు. కేసీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉన్నాయి. కేసీఆర్ మామూలు వ్యక్తా.. ఇన్ని సార్లు రాజీనామా చేసి గెలిచిన  నాయకుడు ఎవరైనా ఉన్నారా. గవర్నర్ ఎన్ని సార్లు పోటీ చేసి గెలిచారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అనేది సామెత. గవర్నర్ అదే తెలుసుకోవాలి. కేసీఆర్ ప్రజల మనిషి అని హరీశ్ రావు అన్నారు.

ఒక్క బటన్ నొక్కి సీఎం కేసీఆర్ ఎనిమిది మెడికల్ కాలేజీ లు ప్రారంభించారు. ఒక్క ఎయిమ్స్ తెచ్చి పీఎం డబ్బా కొట్టుకున్నారు. జీ 20కి సంబంధించిన మీటింగ్ లో హైదరాబాద్ ప్రతిష్ట పెంచేలా మాట్లాడాలి కానీ గవర్నర్ ప్రతిష్టను మంట గలిపేలా మాట్లాడారు. రజనీ కాంత్ తమిళ నాడు నుంచి వచ్చిన వ్యక్తి..ఆయన ఉన్నదున్నట్టు మాట్లాడారు. గవర్నర్ కు ఆయన కు తెలిసిన విషయాలు కూడా తెలియవా అంటూ ఎండగట్టారు.

పంచాయతీ స్థానిక సంస్థల్లో అవిశ్వాసానికి నాలుగేళ్ల కనిష్ట పరిమితి ని పెంచితే గవర్నర్ కు ఇబ్బంది ఏమిటీ. అభివృద్ధి కోణం లో ఆ నిర్ణయం తీసుకున్నాం.. గవర్నర్ అలాంటి బిల్లును ఆపొచ్చా. దాంతోపాటు తొమ్మిది బిల్లులు గవర్నర్ ఆపొచ్చా. గవర్నర్ బీజేపీ కనుసన్నల్లో పని చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. గవర్నర్ కు రాజకీయాలు ఇష్టముంటే మళ్లీ బీజేపీ లో చేరి పోటీ చేయొచ్చని హరీశ్ రావు సలహా ఇచ్చారు.

Latest News

More Articles