Tuesday, May 21, 2024

మందు పంచను, డబ్బులివ్వను.. మీరు కరుణిస్తే గెలుస్తా.. లేకపోతే ఇంట్లో కూచుంటా

spot_img

ఓట్లప్పుడు మందు పంచడం.. డబ్బులివ్వడం లాంటి అలవాటు తనకు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. మీరు కరుణిస్తే మళ్ళీ గెలుస్తా..లేకపోతే ఇంట్లో కూచుంటా అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్‎లో బీసీ బంధు పథకం కింద లబ్దిదారులకు మంత్రి కేటీఆర్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ పథకం కింద 600 మందికి ఆయన చెక్కులందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ తొమ్మిదేళ్లు సంక్షేమంలో స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. పేదలను దృష్టిలో పెట్టుకొని, కులవృత్తులను నమ్ముకున్న వారి కోసం పథకాలు అందుబాటులోకి తెచ్చాం. అందరి కంటే ఆర్థికంగా అడుగున ఉన్న వారి కోసం దళితబంధు అమలు చేస్తున్నాం. అంతేకాకుండా 14 వృత్తులపై ఆధారపడిన వారి కోసం బీసీ బంధు అమలు చేస్తున్నాం. జిల్లాలో ఈ పథకం కింద 10 వేల దరఖాస్తులొచ్చాయి.. ఇవాళ తొలివిడతలో 600 మందికి ఇస్తున్నాం. వచ్చే నెలలో మరికొందరికి ఇస్తాం..ఇది నిరంతర ప్రక్రియ. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈ పథకం కింద ఆర్థిక సహాయం చేస్తాం. వేములవాడ దగ్గర కొందరు నార్లు వేస్తుంటే.. వాళ్ళను అడిగితే బెంగాల్ నుంచి వచ్చామన్నారు. ఇక్కడి నేతన్నలకు కూలి దొరకాలని బతుకమ్మ చీరల ఆర్డర్ తీసుకొస్తే.. అందులో పని చేస్తున్న వారంతా ఇతర రాష్ట్రాల వాళ్ళే. దేశంలో ఎక్కడా లేని విధంగా 12 లక్షల మందికి కల్యాణ లక్ష్మి కింద చేయూతనిచ్చాం. పథకాల కింద వచ్చే నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. సెప్టెంబర్‎లో సిరిసిల్లలో మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. మహబూబాబాద్ వెళ్ళినప్పుడు తెలుసుకుంటే అక్కడి మెడికల్ కాలేజీలో 140 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. రైతు భీమానే కాదు.. నేతన్న భీమా కూడా మొదలు పెట్టాం. పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు చనిపోతే.. వారి సంబంధీకులకు ఆ పింఛన్ వెంటనే బదిలీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. బీసీ బంధు కింద చేసే ఆర్థిక సహాయం గ్రాంట్ మాత్రమే.. మీరు మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు. నియోజక వర్గానికి 3000 మంది చొప్పున గృహలక్ష్మి కింద ఆర్థిక సహాయం చేస్తాం, ఈ జిల్లాలో నేటి నుంచే ప్రారంభిస్తాం. సిరిసిల్లలో ఏదైనా మొదలు పెడితే పక్క నియోజకవర్గాల వాళ్ళు ఏడుస్తున్నారు.. అందుకే సీక్రెట్‎గా చేస్తున్నా. ఓట్లప్పుడు మందు పంచడం.. డబ్బులివ్వడం లాంటి అలవాటు లేదు. మీరు కరుణిస్తే మళ్ళీ గెలుస్తా..లేకపోతే ఇంట్లో కూచుంటా’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles