Tuesday, May 21, 2024

మాది తెలంగాణ అని కాలర్ ఎగరేసుకొని చెప్తున్నారు

spot_img

బీసీ కులవృత్తుదారులకు లక్ష రూపాయల సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలోని మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ వీపి గౌతమ్‎లు ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 290 లబ్ధిదారులకు గాను సుమారుగా 2.90 కోట్ల రూపాయల విలువైన చెక్కులను మంత్రి పువ్వాడ స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పూనుకొల్లు నీరజ, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఏఎంసీ చైర్ పర్సన్ శ్వేత, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘం నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ సంక్షేమ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎంబసీ వృత్తిదారుల సంక్షేమ కోసం ఈ కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెల జిల్లాలో 300 మందికి చెక్కులు అందజేస్తాం. గత ప్రభుత్వాల హయాంలో ఏ స్కీమ్ పెట్టినా కంటితుడుపుగా ఉండేది. సీఎం కేసీఆర్ హయాంలో ఎంతో పారదర్శకంగా పధకాలను అమలు చేస్తున్నారు. 14,880 మందిని జిల్లాలో అర్హులుగా గుర్తించాం. ఇటువంటి స్కీములు చేయాలంటే సీఎం కేసీఆర్‎కే సాధ్యం, దానికి గుండె ధైర్యం కావాలి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఇప్పటివరకు 12 లక్షల మంది ఆడ పిల్లలకు చెక్కులు ఇచ్చిన ఘనత కేసీఆర్‎కే దక్కుతుంది. రూ. 80 కోట్ల రూపాయల విలువైన చెక్కులు జిల్లాలో అందజేశాం. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. బీసీ కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ సీఎం కేసీఆర్ ఆదుకున్నారు. ఇప్పుడు ఎంబసీ కులాల కోసం ఈ స్కీం పెట్టారు. ఇది రుణం కాదు…. గ్రాంట్ మాత్రమే. మీరు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో పెట్టుకొని అభివృద్ధి చెందాలి. ఈ చెక్కుల కోసం ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి ఇచ్చారా? రాష్ట్రంలో ఏ స్కీం తీసుకున్నా ఎంతో పారదర్శకంగా అమలు చేస్తున్నాం. పేదలకు సంక్షేమం అమలు చేయాలని గత ప్రభుత్వాలకు లేదు. ప్రభుత్వం అందించే పథకాలు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలి. నాయి బ్రాహ్మణులు, రజకులకు ప్రభుత్వం తరపున 250 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతాయి, లేకపోతే ఆగిపోతాయి. నియోజకవర్గంలో 3,000 మందికి గృహాలక్షి పధకం అమలు చేస్తాం. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అందించాం. రైతులు బాగుండాలని రైతుబంధు స్కీం సీఎం కేసీఆర్ పెట్టారు. స్వయం పరిపాలనలో తెలంగాణ వాళ్లు మాది తెలంగాణ అని కాలర్ ఎగరేసుకొని చెప్పే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు ఎంత కరెంట్ కోతలు ఉన్నాయో మీకు తెలుసు. ఇప్పుడు ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉందా? ప్రజలు గమనించాలి. జిల్లాలో 45 వేల మందికి ఒక్క రూపాయి తీసుకోకుండా నల్లా కనెక్షన్లు ఇచ్చాం. బడుగు బలహీన వర్గాలకు ఎవరు అండగా ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి’ అని మంత్రి పువ్వాడ అన్నారు.

Latest News

More Articles