Saturday, May 18, 2024

పాలమూరు-రంగారెడ్డికి అనుమతులు సీఎం కేసీఆర్ పట్టుదలకు ఫలితం

spot_img

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో చేసిన కృషి ఫలించిందని కేటీఆర్ అన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఇప్పుడు యుద్ధప్రాతిపదికన పూర్తి కానుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ (ఈఏసీ) కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫారసు చేయగా, అనుమతులు ఇక లాంఛప్రాయమే కావడం విశేషం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 34వ ఈఏసీ సమావేశం నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని ఈఏసీకి తెలంగాణ సర్కారు గతంలో విజ్ఞప్తి చేసింది. అయితే ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనాలను సమర్పించాలని ఈఏసీ గతంలో తెలంగాణకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇరిగేషన్‌ అధికారులు అందుకు సంబంధించిన నివేదికలను సైతం ఈఏసీకి అందజేశారు. వాటన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఏసీ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేయడం విశేషం. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ఈఏసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Latest News

More Articles