Monday, May 13, 2024

కేసీఆర్‌ కంటే మెరుగైన లీడర్‌ ఎవరు? బీఆర్‌ఎస్‌ను మూడోసారి గెలిపించాలని ప్రజలు ఎప్పుడో డిసైడయ్యారు

spot_img

హైదరాబాద్‌: ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను మూడోసారి గెలిపించాలని ప్రజలు ఎప్పుడో డిసైడయ్యారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తమ మ్యానిఫెస్టోపై ప్రజలకు నమ్మకం ఉన్నదని. బీజేపీ ఇప్పటివరకు మ్యానిఫెస్టోను కూడా ప్రకటించలేకపోయిందన్నారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం మాకు లాభం అవుతుందని ఆదివారం ఆయన మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తెలిపారు. సిట్టింగ్‌లకే మళ్లీ మేము టికెట్లు ఇవ్వడం అనేది వ్యూహాత్మకమే అని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే కరువు

కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ వారికి 35-40 సీట్లలో వారికి అభ్యర్థులు లేరు. ఈ సారి ఎన్నికల్లో ముమ్మాటికీ మరోసారి వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీనే అని తెలిపారు. మన పనితీరు బాగాలేకపోతే, ప్రజలు ఒక ప్రభుత్వాన్ని దించాలనుకుంటే ఏం చేసినా దాన్ని మార్చలేమన్నారు. ఉదాహరణకు కర్ణాటకలో మూడేండ్ల ముందే బీజేపీని రిజెక్ట్‌ చేయాలని ప్రజలు నిర్ణయించారు. అక్కడ వారికి కాంగ్రెస్‌ ప్రత్యామాయంగా కనిపించింది.అందుకు ఆదరించారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.

పక్కా రాష్ట్రాలపై ప్రభావం

తెలంగాణలో కేసీఆర్‌కు 90-100 సీట్లు వస్తే దీని ప్రభావం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలపై కూడా ఉంటుందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి.  కేసీఆర్‌ను ఏకపక్షంగా గెలిపించొద్దు అన్నట్టుగా ఉన్నది బీజేపీ, కాంగ్రెస్‌ తీరు ఉందన్నారు. రాహుల్‌గాంధీ వచ్చి ఎక్స్‌పాన్షన్‌ జాయింట్లను చూసి పగుళ్లు అంటాడు.. మోదీయేమో నేషనల్‌ డ్యాం సెఫ్టీ అథారిటీ అధికారులను పంపిస్తాడు. దున్నపోతు ఈనిందని ఒకరంటే, దూడను కట్టేయమని మరొకరు అన్నట్టుగా ఉన్నది పరిస్థితి అని ఎద్దేవా చేశారు.

రిస్క్‌ వద్దు మనకు కేసీఆరే ముద్దు

కేసీఆర్‌ కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చే లీడర్‌ రాష్ట్రంలో ఎవరు? బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో బీఆర్‌ఎస్‌ కన్నా మెరుగైన నమూనా ఉంటే చూపించాలని సవాల్ చేశారు. పదేండ్లలో ఇంత వృద్ధి సాధించినప్పుడు.. ఇంతకన్నా మెరుగైన ఫలితాలు అందించే నాయకుడే లేనప్పుడు.. రెండుసార్లు ఇచ్చాం కదా అనేది అసలు లాజిక్కే కాదన్నారు. తప్పకుండా మూడోసారి ప్రజలు కేసీఆర్ వెనుకు ఉన్నారన్న ధీమాను వ్యక్తం చేశారు.  ‘రిస్క్‌ వద్దు మనకు కేసీఆరే ముద్దు’ అని ప్రజలు బలంగా నమ్ముతున్నారని, రాబోయే ఎన్నికల్లో ఇది రుజువవుతుందన్నారు.

1,60,283 ఉద్యోగాలు భర్తీ

1,60,283 ఉద్యోగాల భర్తీ పూర్తయింది. మా మీద దాడిచేసేవాళ్లు ఈ దేశంలో ఇంతకన్నా ఎక్కువ భర్తీ చేసిన ఒక్క రాష్ట్ర ప్రభుత్వమైనా ఉంటే దయచేసి చూపాలన్నారు. టీఎస్‌పీఎస్సీలో నమోదైన 30 లక్షల మంది సంపూర్ణ నిరుద్యోగులు కాదని, గ్రూప్‌ 1, 2,3 4 సహా అన్ని రకాల పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నది 12 లక్షల మంది మాత్రమే అన్న విషయాన్ని విదాదం చేసేటోళ్లు గమనించాలని సూచించారు.. విషయాన్ని లోతుగా అధ్యయనం చేయకుండా నోరుపారేసుకోవటం ప్రతిపక్షాలకు అలవాటైపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉద్యోగాలకు పక్కాగా జాబ్‌క్యాలెండర్‌ జారీ చేస్తామని చెప్పారు.అదే సమయంలో ప్రైవేట్‌ రంగంలో ఇప్పటికే 24 లక్షల మందికి ఉపాధి కల్పించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని తెలిపారు. టీఎస్‌పీస్సీ పేపర్‌ లీకేజీలపై చర్యలు తీసుకున్నామని, పొరపాట్లకు దిద్దుబాటు చర్యలుంటాయని, ఆ చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

88పైగా సీట్లలో గెలుస్తున్నం

దేశాన్ని తాకట్టు పెట్టి అయినా సరే అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ చూస్తున్నదని విమర్శించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం కేసీఆర్‌ మీద కోపం తీర్చుకోవాలని చూస్తే నష్టపోయేది సమాజం అన్నారు. కులం, మతం, ప్రాంతం అని పిచ్చిలేకుండా ఈ తొమ్మిదిన్నరేండ్లు అభివృద్ధి, మంచి ఆశయం, స్వచ్ఛమైన రాజకీయం చేసే కేసీఆర్‌ కావాలా? మన భవిష్యత్తును దెబ్బకొట్టే పార్టీ కావాలా? అనేది ప్రజలే ఆలోచించుకోవాలని కేటీఆర్ సూచించారు. 2014లో 63, 2018లో 88 సీట్లు వచ్చాయి. తొలిసారి కంటే 25 సీట్లు రెండోసారి అధికంగా వచ్చా యి. అదే బాటలో ఈసారి 88పైగా సీట్లలో గెలుస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

Latest News

More Articles