Friday, May 17, 2024

ప్రజారవాణా బలోపేతంతోనే నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణ

spot_img

హైదరాబాద్ నగరంలో ఫుట్ పాత్ ల నిర్మాణం, విస్తరణ, ప్రణాళికల రూపకల్పన కు సంబంధించి నగర పోలీస్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ, సంబంధిత ఇతర శాఖల అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. రోజురోజుకు అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ లాంటి నగరాల్లో పాదాచారులకు రక్షణ కల్పించడం, పుట్ పాత్ ల నిర్మాణం, రోడ్ల విస్తరణ లాంటి సవాళ్లు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయన్న కేటీఆర్, ఎప్పటికప్పుడు నూతన ప్రణాళికలను అమలుచేయడంతోనే ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నగరంలో రోడ్ల విస్తరణ, నూతన మౌలిక వసతుల కల్పన, ఫుట్ పాత్ ల నిర్మాణం వంటి కార్యక్రమాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో అనేక చోట్ల కొత్తగా ఫ్లై ఓవర్లు, ఇతర రోడ్ల నిర్మాణాలు పూర్తైన నేపథ్యంలో వాటికి అనుబంధంగా ప్రస్తుతం ఉన్న రహదారులపైన పుట్ పాత్ ల నిర్మాణాన్ని  కొనసాగిస్తూ పాదాచారుల నడకకు మరింత అవకాశం కల్పించేలా తీసుకోవాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను కేటీఆర్ వ్యక్తపరిచారు.

హైదరాబాద్ నగరంలో వాహనాల సంఖ్య కొన్ని సంవత్సరాలుగా అనేక రెట్లు పెరిగిందని ఫలితంగా రోడ్ల పైన భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుందని, ప్రజలకు అనువైన ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే ఈ సవాల్ ని ఎదుర్కోవడం సాధ్యమవుతుందన్నారు కేటీఆర్. తక్కువ దూరాలకు వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా నడక లేదా సైకిల్ వంటి పద్ధతులను కొన్ని నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా  ఉపయోగిస్తున్నారని తెలిపారు.

పాదచారుల రక్షణ కోసం పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది అందించాల్సిన సహకారంతో పాటు నగరంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్ లు, నూతన ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

నగరంలో ఇప్పటికే 60 జంక్షన్ లను జిహెచ్ఎంసి అభివృద్ధి చేస్తోందని, పాదాచారులే ప్రధాన కేంద్రంగా దాదాపు 12 జంక్షన్లలో మౌలిక వసతులను కల్పిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ కు జిహెచ్ఎంసి అధికారులు ఈ సమావేశంలో వివరించారు. కూకట్ పల్లి, సోమాజిగూడ, పంజాగుట్ట,కొత్తపేట, హబ్సిగూడ, ఖైరతాబాద్ వంటి అనేక ప్రాంతాల్లో నూతనంగా జంక్షన్ లను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Latest News

More Articles