Saturday, May 18, 2024

ఆ జిల్లాలో కేవలం 2 లక్షల ఓట్లే

spot_img

రాష్ట్ర ఎన్నికల సంఘం 2023 సంవత్సరానికి ఓటర్ల తుది జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,99,92,941 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,49,24,718 మంది, పురు ష ఓటర్లు 1,50,48,250 మంది ఉన్నట్టు ఈసీ పేర్కొన్నది. యువ ఓటర్లు (18-19 ఏండ్ల వయస్కులు) 2,78,650 మంది ఉన్నట్టు తెలిపింది. జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 42,15,456 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,08,176 ఓటర్లు ఉన్నారు. రెండో స్థానంలో రంగారెడ్డి (31,08,068) మూడో స్థానంలో మేడ్చల్‌-మల్కాజిగిరి (25,24,951) ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 6,44,072 మంది, అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 1,42,813 మంది ఓటర్లు ఉన్నారు. గత ఏడాది నవంబర్‌ నాటికి 2,95,65,669 మంది ఓటర్లతో ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించింది. 6,84,408 మంది ఓటర్లను కొత్తగా చేర్చి, 2,72,418 ఓట్లను తొలగించి తుది జాబితాను విడుదల చేసింది.

ఓటర్ల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి, అన్ని వర్గాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించిన తర్వాతే తుది జాబితాను విడుదల చేశామని వెల్లడించారు. 18-19 ఏండ్ల వయస్కులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్లుగా నమోదు చేయించామని వివరించారు. 361 గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 2,800 మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించామని చెప్పారు. 312 మంది ట్రాన్స్‌జెండర్లను కూడా కొత్తగా ఓటర్లుగా చేర్చామని పేర్కొన్నారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటు హక్కు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

Latest News

More Articles