Sunday, May 12, 2024

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ‘సర్ చోటూ రామ్ అవార్డు’.. అందుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి

spot_img

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రకటించిన ‘సర్ చోటూ రామ్ అవార్డు’ను వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు అందజేశారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, మూసీ రివర్ బోర్డ్ మేనేజ్ మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.  అవార్డును మంత్రికి అందజేసిన వారిలో ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సంయుక్త్ కిసాన్ మోర్చా సభ్యులు సత్నాం సింగ్ బెహ్రూ, ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్  అఖిల భారత సలహాదారులు సుఖ్ జిందర్ సింగ్ కాకా, రాచ్ పాల్ సింగ్ ఖల్సా, మీడియా కార్యదర్శి అవతార్ సింగ్ దుండా ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రైతాంగ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మహాయజ్ఞం మొదలుపెట్టాడన్నారు. దేశంలో అతిపెద్ద రంగం వ్యవసాయ అని,  ఇందులో విశేషమైన మార్పు రావాలన్నది కేసీఆర్ సంకల్పమన్నారు. ఇక్కడి భూమిని, నీళ్లను, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని ప్రపంచానికి మనమే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగగలదన్నారు. కానీ ప్రస్తుత విధానాలు అందుకు తగ్గట్టులేవని తెలిపారు.

ఆహారరంగంలో  అతి గొప్ప ఉపాధి అవకాశాలు ఉన్నవి. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఏవీ కనిపించవు. తెలంగాణ మోడల్ దేశానికి పరిచయం చేసి కొత్త దారి చూపాలన్న తపనతో సీఎం ఉన్నారు. దీనికి మేధావులు, రైతు నాయకులు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. మోడీ ప్రభుత్వ నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి 700 మంది పైచిలుకు రైతులు చనిపోతే కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోయింది.

రైతుల పోరాటానికి తలొగ్గి, నిస్సిగ్గుగా జాతికి క్షమాపణలు చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నా చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న ఆలోచన తట్టలేదన్నారు. కానీ ఎక్కడో పంజాబ్ కు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాల ఎల్లలు దాటి చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున సాయం అందించారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

సర్ ఛోటురామ్ ఎవరంటే?

పంజాబ్ రైతులు ప్రధానంగా ఇద్దరు వ్యక్తులను ఆరాధిస్తారు. ఒకరు సర్ ఛోటు రామ్, మరొకరు స్వామినాథన్. 1881లో బ్రిటీష్ ఇండియాలో పంజాబ్ ప్రావిన్స్ లో సర్ ఛోటు రామ్ ఝాట్ కుటుంబంలో జన్మించారు. యునైటెడ్ పంజాబ్ ప్రావిన్స్ ను పాలించిన నేషనల్ యూనియనిస్ట్ పార్టీకి ఆయన సహ వ్యవస్థాపకుడు. నాడు కాంగ్రెస్, ముస్లింలీగ్ లను తన పార్టీకి దూరంగా ఉంచారు.

వడ్డీ వ్యాపారుల చేతుల్లో పడి నలిగిపోతున్న నాటి పంజాబ్ రైతుల శ్రేయస్సు దృష్ట్యా సర్ ఛోటు రామ్ 1934లో పంజాబ్ రిలీఫ్ అప్పుల చట్టం, 1936లో పంజాబ్ రుణదాతల రక్షణచట్టం తేవడానికి కృషిచేశారు. తదనంతర కాలంలో ఈ చట్టాలు పంజాబ్ రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాయి. ఆ తర్వాత హరితవిప్లవంతో స్వామినాధన్ పంజాబ్ రైతులను గణనీయంగా ప్రభావితం చేశారు. ఆ తర్వాత తమను ప్రభావితం చేసిన వ్యక్తి కేసీఆర్ అని పంజాబ్ రైతులు మంత్రి నిరంజన్ రెడ్డితో అన్నారు. అందుకే ఈ అవార్డు వారికి ఇస్తున్నట్లు వెల్లడించారు.

Latest News

More Articles