Saturday, May 18, 2024

కేసీఆర్ అనుకుంటే రాజీవ్ గాంధీ పథకాలకు ఆ పేర్లు ఉండేవా?

spot_img

నిజామాబాద్ జిల్లా లక్కొరాలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మేల్యే పల్లా రాజేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. తెలంగాణను తీసుకొచ్చి, బాగుచేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నారు. ‘బీఆర్ఎస్ పాలనలో ప్రజలు లబ్ధి పొందారు తప్ప.. కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేశారు. ఇలాంటి పార్టీ కార్యకర్తలు హామీల అమలు కోసం బరి గీసి పోరాడుతారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఇపుడు 5 గంటల కరెంటు కూడా సరిగా రైతులకు అందటం లేదు. హామీల అమలుపై నిలదీస్తే కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పలేక ఆక్రోశంతో వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నట్లు రైతుల వద్ద వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి.

Read Also: కేసీఆర్ హయాంలో కనీసం వేతనం 18 వేలు.. కాంగ్రెస్ వచ్చాక 11 వేలు

కాళేశ్వరంపై నోటికొచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసి అబద్ధాన్ని నిజం అని నమ్మించారు. రంగనాయక సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టులు ఎక్కడి నుండి వచ్చాయి? రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఎలా వచ్చిందో ఆలోచన చేయాలి. తెలంగాణలో 99 శాతం 10 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతుబందు కోసం కేటాయించిన రూ. 7500 కోట్ల నిధులు ఎక్కడికి పోయాయి? రైతు బందు అడిగితే చెప్పుతో కొట్టమని మంత్రి కోమటి రెడ్డి అనటం ఎంతవరకు సమంజసం?. కేసీఆర్ హాయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదని అసత్య ప్రచారం చేశారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సొమ్ము ఒక్కడిది.. సోకు ఒకడిది అన్న చందంగా వ్యవహరిస్తుంది. స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ, కాంగ్రెస్ వాళ్లు మాత్రం తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ పేరుతో ఉన్న పథకాల పేర్లు మారుస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ కూడా అదేపని చేసి ఉంటే రాజీవ్ గాంధీ పథకాల పేర్లు ఉండేవా? బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయిస్తున్నరు.. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు’ అని పల్లా తేల్చి చెప్పారు.

Latest News

More Articles