Sunday, May 12, 2024

కాంగ్రెస్ మొసలి కన్నీరు నమ్మితే వచ్చే ఐదేళ్లు రక్త కన్నీరే

spot_img

కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ల పేరుతో కొత్త డ్రామాకు తెర లేపుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు ఇలా బాండ్ పేపర్లు రాయటం కాంగ్రెస్ పై విశ్వాసం కోల్పోయింది అనటానికి ఉదాహరణ అన్నారు. నిజామాబాద్‎లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ‘కర్ణాటకలో ఇచ్చిన 6 హామీలను కాంగ్రెస్ నాయకులు గాలికి వదిలేశారు. కర్ణాటకలో చేసిన డ్రామా ఇక్కడ కూడా చేస్తున్నారు. అధికారం కోసం కాంగ్రెస్ వాళ్లు ఎంతకైనా దిగజారుతారు. రాహుల్ గాంధీ 100 రోజుల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని కర్ణాటకలో చెప్పారు. నిరుద్యోగం విషయంలో సీఎంఐఈ ప్రకటించిన రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ పాలిస్తున్న హర్యానా, రాజస్థాన్‎లు మొదటి వరసలో ఉన్నాయి. 10 ఏళ్లలో మేం తెలంగాణలో 2 లక్షల 36 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చాం. దేశంలో ఇతర ఏ రాష్ట్రాల్లో అయిన తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు నిరూపిస్తే ఒక్క ఓటు అడగను. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న నిరుద్యోగ మీటింగులు ఆ పార్టీ రాజకీయ నిరుద్యోగ మీటింగ్. మొసలి కన్నీళ్లకు బలి అయితే వచ్చే ఐదేళ్లు మిగిలేది కన్నీరే.

Read also: చేప చిక్కింది.. మత్స్యకారుడి పంటపండింది

11 పర్యాయాలు పాలించిన కాంగ్రెస్ 6 గంటల కరెంట్ ఇస్తే.. బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇచ్చింది. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‎గా ఉంది. తెలంగాణ రాక ముందు 7784 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంటే.. నేడు 1860 మెగా వాట్ల వినియోగం ఉంది. కాంగ్రెస్ పాలనలో కేవలం 5 మెడికల్ కళాశాలలు ఉంటే.. ఇప్పుడు 34 ఏర్పాటు చేసుకున్నాం. 10 ఏళ్లలో మాతాశిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించుకున్నాం. గతంలో రాష్ట్రంలో వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉంటే ఈరోజు తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం. రైతు పేదరికాన్ని తగ్గించాం. ఆనాడు కరెంట్ కష్టాలు ఎట్లా ఉండేనో రైతులు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్‎కు పట్టం కడతారని విశ్వాసం ఉంది. ముఖ్యంగా ఆడబిడ్డలు బీఆర్ఎస్‎కు అండగా ఉంటారు. కటాఫ్‎ను ఎత్తివేసి బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇస్తాం. గల్ఫ్ కార్మికుల కోసం కొత్త పాలసీ అమలు చేస్తాం. కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. యువ ఓటర్లు ఆత్మ విమర్శ చేసుకొని ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో మీ వంతు పాత్ర పోషించాలి’ అని కవిత పిలుపునిచ్చారు.

Latest News

More Articles