Saturday, May 18, 2024

పెళ్లి భోజనం తిని ఆస్పత్రి పాలైన 150 మంది

spot_img

అక్కడో పెళ్లి జరుగుతోంది. బంధువులు, మిత్రులతో పెళ్లి మండపం సందడిగా మారింది. తీరా ముహూర్త సమయం రావడంతో.. వరుడు, వధువు మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత అందరూ భోజనాలు చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ, భోజనం చేసిన కాసేపటికి అసలు కథ మొదలైంది. పెళ్లికి వచ్చి తిన్న వారందరూ.. అస్వస్థతకు గురయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. అలా ఏకంగా 150 మంది అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటన కర్నాటకలో సోమవారం జరిగింది.

బెలగావి జిల్లాలోని చిక్కోడి తాలూకా, హిరేకోడి గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. బంధు, మిత్రులతో పాటు గ్రామంలోని చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పెళ్లి వేడుకకు హాజరైన చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. భోజనం చేసిన రెండు గంటల తర్వాత వీరందరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో వీరందరినీ దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. భోజనాల్లో కల్తీ జరగడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వంట పదార్థాలను, అలాగే వాటర్‎ని కూడా పరీక్షల నిమిత్తం ల్యాబ్‎కు పంపించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఏకంగా గ్రామంలోనే ఎమర్జెన్సీ క్లినిక్ కూడా ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Latest News

More Articles