Sunday, May 19, 2024

అతిగా శానిటైజర్‌ను వాడుతున్నారా..? అయితే ప్రమాదం తప్పదు

spot_img

హ్యాండ్‌ శానిటైజర్ దీని గురించి తెలియని వారు ఉండరు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు అంతా దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా చేతులకు శానిటైజర్‌ రాసుకోవడం మాత్రం రోజూ కార్యకలాపాల్లో భాగంగా మారిపోయింది. దేన్ని పట్టుకున్నా వెంటనే జేబు లేదా పర్స్‌లో నుంచి శానిటైజర్‌ బాటిల్‌ను తీసుకుని వెంటనే చేతులపై రాసేసుకుంటున్నారు. అయితే, అనవసరంగా, అతిగా శానిటైజర్‌ వాడటంవల్ల చాలా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

హ్యాండ్‌ శానిటైజర్‌ అతిగా వాడటంతో మన బ్రెయిన్‌ దెబ్బతింటుందని  తాజా అధ్యయనంలో తేలింది. ఒహియో కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ యూనివర్సిటీలోని మాలిక్యులర్‌ బయాలజీ డిపార్ట్‌మెంట్‌ చేసిన సర్వేలే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హ్యాండ్‌ శానిటైజర్‌ వల్ల మెదడులోని కణాలు దెబ్బతింటాయని ఈ అధ్యయనంలో తేలింది. మనుషుల మెదడులో ఒలిగోడెండ్రోసైట్స్‌ అనే కణాలు ఉంటాయి. ఈ కణాలు మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉంటాయి. మెదడు వేగంగా, చురుగ్గా పనిచేసేందుకు ఈ కణాలు సహాయపడతాయి. ముఖ్యంగా మన బుర్రకు వేగంగా సంకేతాలు పంపించడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే, ప్రస్తుతం మనం వాడే శానిటైజర్లలో ఉన్న కొన్ని రసాయనాల కారణంగా ఈ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది.

మనం వాడే శానిటైజర్‌ కారణంగా అందులోని రసాయనాలు ముక్కు, చేతులు, చర్మం ద్వారా శరీరంలోకి వెళతాయి. అలా వెళ్లిన శానిటైజర్‌లోని రసాయనాలు.. మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉన్న ఒలిగోడెండ్రోసైట్స్‌ కణాలను దెబ్బతీస్తాయని.. దీని వల్ల క్రమంగా మెదడు చురుగ్గా పనిచేయడం మానేస్తుందని పరిశోదనలో తేలింది. ఒక్క హ్యాండ్‌ శానిటైజరే కాదు.. సబ్బులు,ఇంటినీ, టాయ్‌లెట్లను శుభ్రపరచటానికి ఉపయోగించే రసాయనాలను అతిగా వాడటం వల్ల సమస్యలు వచ్చి పడతాయట.

కేవలం మెదడుకే కాదు.. శానిటైజర్‌ అతిగా వాడటం మన ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్‌ తరచుగా వాడినప్పుడు.. చర్మం కందిపోయి దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇందులోని ఆల్కహాల్‌తో పాటు ఉండే అనేక రసాయనాలు చర్మపు సహజ నూనెలను హరిస్తాయి. దాంతో చర్మంలోని సహజమైన తేమ తగ్గిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా చాలా తేలిగ్గా చర్మంలోకి చేరుతుందని తెలిపారు నిపుణులు.

శానిటైజర్లోని ఆల్కహాల్‌లో ఉండే ఐసోప్రొపనాలియన్‌ వంటివి చేతుల్లోని కణాలకు హాని కలిగిస్తాయి. దాంతో చర్మం పొడిబారుతుంది. ఇలా జరిగినప్పుడు డెర్మటైసిస్‌ ఇన్ఫెక్షన్‌లు వచ్చే అకవాశాలు ఎక్కువ. అంతేకాదు శానిటైజర్లలో ఉపయోగించే రసాయనాల పరిమళాలు కొందరికి అలర్జీ కలిగేలా చేస్తాయి. అంతేకాదు దీని వాడకం వల్ల హార్మోన్ల అసమతుల్యతకూ కారణమవుతుంది. అందులో ఉండే ట్రైక్లోసామ్‌ అనే రసాయనం యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తుంది. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియాకు యాంటీబయాటిక్‌లను తట్టుకునే సామర్థ్యమూ పెరుగుతుంది. దీంతో తేలికగా ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఎస్‌బీ ఆర్గానిక్స్‌ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

Latest News

More Articles