Sunday, May 19, 2024

బెంగళూరు నీటి కష్టాలు.. నెలకు ఐదుసార్లే స్నానం

spot_img

కాంగ్రెస్‌ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నీటి సంక్షోభం మరింత తీవ్రమైంది. తాగు నీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగానే బోర్లు ఎండిపోవడంతో నగరంలో ఈ పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. అటు నగర జలమండలి కూడా సరిపడా నీటిని సరఫరా చేయడం లేదు. దీంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి. దీంతో డిమాండ్‌ ఎక్కువవడంతో ట్యాంకర్ల ధరలు అమాంతం పెంచేశారు.

ఎండాకాలం అయినప్పటికీ నెలకు ఐదు సార్లు మాత్రమే స్నానాలు చేస్తున్నామని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వంట వండటం, గిన్నెలు తోమడం వంటి వాటికి నీరు ఎక్కువగా అవసరం ఉండటంతో.. ఫుడ్‌ను బయట నుంచి ఆర్డర్‌ పెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. నివాసితులు ఎక్కువగా ఉన్న కమ్యూనిటీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. రోజుకు నాలుగు నుంచి ఐదు ట్యాంకులు అవసరం ఉండగా.. ఒకటి లేదా రెండు ట్యాంకులు మాత్రమే సరఫరా అవుతున్నాయి. దీంతో గత మూడు నెలలుగా తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు కమ్యూనిటీల్లో నివసించే ప్రజలు వాపోతున్నారు.

మళ్లీ వర్షాలు పడితే తప్ప పరిస్థితి మామూలు స్థితికి వచ్చేలా కనిపిచండం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో పాలకుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న తీరులోనే సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఏ ప్రభుత్వమూ కూడా ప్రజల శ్రేయస్సును పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్ మెంట్‌లు, రోడ్లను నిర్మించడంపైనే దృష్టి పెడుతున్నారని, భూగర్భజలాలపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో తీవ్రమైన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని అవసరాల మేరకు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. తాగునీటిని వాహనాలను తుడిచేందుకు, నిర్మాణం, వినోద కార్యకలాపాల్లో వాడొద్దని, అదేవిధంగా సినిమా హాళ్లు, మాల్స్ లో తాగునీటి అవసరాల మినహా ఇతరత్రా కోసం వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై మొదటగా రూ.5 వేలు జరిమానా పడుతుందని, పదేపదే నీటి వృథాతో ఉల్లంఘనకు పాల్పడితే అదనంగా ప్రతిసారి రూ.500 చొప్పున ఫైన్‌గా చెల్లించాల్సి ఉంటుందని బెంగళూరు జలమండలి హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: ఆదాయానికి మించి ఆస్తులు..జమ్మికుంట తహసీల్దార్ నివాసంలో ఏసీబీ సోదాలు

Latest News

More Articles