Saturday, May 18, 2024

మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణంపై హైకోర్టులో పిల్..

spot_img

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అంతేకాకుండా మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని, ఉచిత ప్రయాణంతో బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకట్లేదని.. ఈ పథకం రద్దు చేయాలని నాగోలుకు చెందిన ఉద్యోగి హరేందర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం గత నెల 8న జారీ చేసిన జీవో 47ను సస్పెండ్‌ చేయాలని కోరారు. 1950లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా చట్టం ప్రకారం ఆర్టీసీ కార్పొరేషన్‌ ఏర్పాటైందని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు.

మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం అంటే పురుషుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని, ఇది రాజ్యాంగంలోని 15వ అధికరణానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణ వసతితో మహిళలు అవసరం లేకున్నా ప్రయాణించే పరిస్థితులు ఏర్పడ్డాయని, దీని ఫలితంగా టికెట్లు కొనుగోలు చేసి వెళ్లే పురుష ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్థికంగా ఆర్టీసీపై పడే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం కూడా అన్యాయమేనని, పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును మహిళల ఉచిత ప్రయాణ వసతికి వినియోగించడం సబబు కాదని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు ఆర్టీసీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ఈ పిల్‌లో ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం త్వరలో విచారణ చేపట్టనున్నది.

Latest News

More Articles