Saturday, May 18, 2024

పొంగులేటికి సొంత అనుచరుల షాక్.. నేడు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి

spot_img

అక్కున చేర్చుకున్న బీఆర్ఎస్‎ను కాదని కాంగ్రెస్‎లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్‌ షాకిచ్చారు. నిన్నమొన్నటి వరకు పొంగులేటితో కలిసి నడుస్తూ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన తెల్లం వెంకట్రావ్‌.. అంతర్గత విభేదాలతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు ద్వారా బీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి ప్రతిపాదనలు పంపించారు. తెల్లం వెంకట్రావ్‌ చేరికకు బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేయడంతో.. ఆయన గురువారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్‌ సమక్షంలో తెల్లం వెంకట్రావ్‌ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. తెల్లంతోపాటు దుమ్ముగూడెం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ కూడా బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు.

తెల్లం వెంకట్రావ్‌ 2014లో మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Latest News

More Articles