Saturday, May 11, 2024

ఈనెల 20న భూదాన్ పోచంపల్లికి రాష్ట్రపతి ముర్ము

spot_img

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 20న పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా చేస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి.. ఇందులో భాగంగానే భూదాన్ పోచంపల్లిలో 20వ తేదీన ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు రాష్ట్రపతి పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారని, పద్మశ్రీ, సంత్ కబీర్, జాతీయ అవార్డు గ్రహీతలతో  మాట్లాడుతారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించామని, అందులో ఎంపిక చేసిన ఐదు నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారని అధికారులు వెల్లడించారు.

పర్యటనలో భాగంగా రాష్ట్రపతి టూరిజం పార్కును సందర్శిస్తారని, తెలంగాణ చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే విధంగా థీమ్ ఫెవిలియన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ముఖ్యగా పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాళ్లు, ముచ్చంపేట చీరలు, నారాయణపేట చీరలు, సిద్ధిపేట గొల్లభామ చీరలు, గద్వాల చీరల ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Latest News

More Articles