Sunday, May 19, 2024

ఈఎంఐ చెల్లించడం ఆలస్యమైతే బ్యాంకులు అధిక వడ్డీలు వేయొద్దు

spot_img

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రణ గ్రహీతలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. జరిమానా వడ్డీల్ని విధించరాదని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆదేశించింది. దీనికి సంబంధించిన నిబంధనలను సవరించింది. శుక్రవారం మార్చిన ఆ నిబంధనల్ని ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. జరిమానా వడ్డీల్ని ఆదాయాన్ని పెంచుకునే సాధనాలుగా బ్యాంకర్లు, ఎన్‌బీఎఫ్‌సీలు చూస్తున్నారంటూ ఆర్బీఐ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే  ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని మార్చేసింది. అయినప్పటికీ రుణగ్రహీతలు తాము తీసుకున్న రుణాల చెల్లింపుల్లో విఫలమైతే జరిమానా చార్జీలు వేయవచ్చంది.

అయితే అవి సహేతుకంగా ఉండాలని తాజా నోటిఫికేషన్‌లో ఆర్బీఐ స్పష్టం చేసింది. ‘ఫెయిర్‌ లెండింగ్‌ ప్రాక్టీస్‌, పీనల్‌ చార్జెస్‌ ఇన్‌ లోన్‌ అకౌంట్స్‌’ పేరిట ఈ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో రుణగ్రహీతలకు ఊరట లభించినట్లైంది. ‘రుణ ఒప్పందం ప్రకారం రుణగ్రహీత.. నియమ, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోనైట్టెతే అవసరమనుకుంటే రుణదాతలు వారిపై ‘జరిమానా చార్జీ’లు వేసుకోవచ్చు. కానీ జరిమానా వడ్డీలను వేయరాదు. వీటి వల్ల వడ్డీరేటు పెరిగి భవిష్యత్తులో చెల్లించబోయే ఈఎంఐ లపైనా భారం పడుతుంది’ అని నోటిఫికేషన్‌లో ఆర్బీఐ వివరించింది. అలాగే జరిమానా చార్జీలపై మళ్లీమళ్లీ ఎటువంటి వడ్డీలను వేయరాదని కూడా తేల్చిచెప్పింది.

Latest News

More Articles