Saturday, May 18, 2024

సీఎంగా నేడు రేవంత్ ప్రమాణస్వీకారం.. తొలి సంతకం దానిపైనే

spot_img

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో మ‌ధ్యాహ్నం 1.04 గంట‌ల‌కు ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తిచేసింది. ఈనేప‌థ్యంలో ఎల్బీ స్టేడియం ప‌రిస‌రాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా.. రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు రానున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పలువురు ఏఐసీసీ పెద్దలు, పలు రాష్ట్రాల కీలక నేతలు హాజరుకానున్నారు. అతిథుల కోసం స్టేడియంలో మూడు వేదికలు ఏర్పాటుచేశారు. ప్రధాన వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం మరో వేదిక ఏర్పాటుచేశారు. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో మరో వేదిక సిద్ధం చేశారు. ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా స్టేడియం బయట నుంచి కూడా వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్‎లు ఏర్పాటు చేశారు.

Read Also: ‘పుష్ప’ నటుడి వేధింపులతో మహిళ సూసైడ్.. అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్వానాలు పంపారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ సిద్ధం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్‎కి స్వాగతం పలకనున్నారు. వేదిక కింద అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటుచేశారు. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలకు కూడా ఆహ్వానం పంపించారు. ప్రమాణస్వీకారం అనంతరం రేవంత్ తన తొలి సంతకం ఆరు గ్యారెంటీలపై పెట్టనున్నారు.

Latest News

More Articles