Sunday, May 19, 2024

కాంగ్రెస్ ప్రభుత్వ బంగ్లాలో టాయ్‎లెట్ల రిపేర్‌కు 35 లక్షలు

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అని చెప్పిన పార్టీ.. ప్రభుత్వం ఏర్పడి నెల దాటిపోయినా హమీలు మాత్రం నెరవేరడంలేదు. అది అలా ఉంచితే.. ప్రస్తుతం ప్రజా భవన్‎గా మారిన ప్రగతి భవన్‎లో రిపేర్ పేరిట లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నివసించిన ప్రగతిభవన్‌పై కాంగ్రెస్‌ నాయకులు చేయని విమర్శలు లేవు. కేసీఆర్‌ తన విలాసాల కోసం ప్రగతి భవన్‌ను కుట్టుకున్నాడని, ప్రజాధనాన్ని వృథా చేశారని అన్నారు. ఆ భవనాన్ని స్టడీ సెంటర్‌గా మారుస్తామని, లేదా దానిని ప్రభుత్వ దవాఖానగా మారుస్తామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంచుతామని కాంగ్రెస్‌ నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ భవనాన్ని తన నివాసంగా మార్చుకున్నారు.

Read also: రేపు అయోధ్య రామమందిరం ప్రారంభం.. 15 రాష్ట్రాల్లో సెలవు

ఇప్పుడు ఆ భవనంలో మరమ్మతుల కోసం కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించేందుకు సిద్ధపడటంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ భవన్‌లో మరుగుదొడ్ల మరమ్మతుకు, జిమ్‌, గన్‌మెన్ల గదుల కోసం భారీ ఎత్తున టెండర్లు పిలవడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. కేవలం మరుగుదొడ్ల మరమ్మతు కోసం రూ.35 లక్షలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించడంపై ముక్కున వేలేసుకుంటున్నారు. దోమ తెరల కోసం కూడా టెండర్లు ఆహ్వానించడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిమ్‌ రూంలో పొడుగు అద్దాలు, గన్‌మెన్‌ల గదుల కోసం రూ.28.70 లక్షలకు టెండర్లు ఆహ్వానించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ టెండర్లకు సంబంధించిన కాపీలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవతుండటంతో సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్రజా భవన్‌లో తమ రాజకీయ విలాసాల కోసం కాంగ్రెస్‌ పార్టీ సిద్ధపడింది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Latest News

More Articles