Sunday, May 19, 2024

ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటే సర్పంచ్ ఎన్నికలు!

spot_img

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలోనే సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుంది. దాంతో సర్పంచ్‌ ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జనవరి 31తో పంచాయతీల గడువు ముగియనున్న నేపథ్యంలో.. సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీనాటికే రాష్ట్రంలో కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌ లేఖ రాశారు. ప్రతిజిల్లాలో ఎన్నికల ప్రిసిడైంగ్‌ అధికారులు, పోలింగ్‌ అధికారులను గుర్తించాలని, వారి వివరాలను ‘టీ పోల్‌’లో నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను ఈ నెల 30లోపు పూర్తిచేయాలని చెప్పారు.

Read Also: సీఎం రేవంత్‎తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని స్థిరీకరించే అంశం ఒకటి పెండింగ్‌లో ఉన్నది. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం బీసీ కమిషన్‌ను నివేదిక కోరింది. అయితే బీసీ కమిషన్‌ ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు బీసీ కమిషన్‌ నివేదిక ఇచ్చినా దాన్ని ప్రభుత్వం ఆమోదించి ఎన్నికలపై నిర్ణయం తీసుకొనేందుకు కనీసం మరో నెల రోజులు పట్టేలా ఉన్నది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 224 గ్రామపంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన అంశం గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నది. ఒకవేళ గవర్నర్‌ ఆమోదం తెలుపకపోతే.. మళ్లీ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ విషయంలో కొత్త ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. జనవరిలో పంచాయతీలకు ఎన్నికలు జరగకపోతే పర్సన్‌ ఇన్‌చార్జిలను పెట్టే అవకాశం ఉన్నది. ఫిబ్రవరి-మార్చిల్లో లోక్‌సభ ఎన్నికల సందడి మొదలై మే నాటికి ముగుస్తుంది. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు సంబంధించిన ఎన్నికలు కూడా ఉన్నాయి. పంచాయతీల ఎన్నికలను కూడా జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలతోపాటే పెట్టే అవకాశం ఉందని పలువురు నిపుణులు అంటున్నారు.

Latest News

More Articles