Sunday, May 12, 2024

ఓట్ల కోసం ఊరూరా ఏనుగు విగ్రహాలు పెట్టించిన మీకు.. అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడే హక్కు లేదు

spot_img

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్  లో పుట్టి అదే ఉత్తరప్రదేశ్ లోనే దిక్కు దివానం లేకుండా పోయిన BSP అధినేత్రి మాయావతి… పార్టీ ఉనికే లేని తెలంగాణకు వచ్చి సీఎం అభ్యర్థిని ప్రకటించడం కన్నా హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ఛైర్మన్  వై.సతీష్ రెడ్డి అన్నారు.

మాయావతి సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోనే ఆమెకే డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అలాంటిది తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ మాట్లాడటం చూస్తే ఆమె మానసిక పరిస్థితిపై అనుమాన పడాల్సి వస్తోందన్నారు. అసలు తెలంగాణలో BSP పేరు చెప్పుకొని తిరుగుతున్న ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత బహుజనులను పూర్తిగా పక్కన పెట్టేసి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే పనిచేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. తెలంగాణ వంటి సంక్షేమం ఇంకెక్కడ లేదని అన్ని రాష్ట్రాలు, అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది.  అది  మాయావతి గారి కళ్ళకు కనపడకపోవడం విడ్డూరం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడంపైనా మాయావతి విమర్శలు చేయడం ఆమె రాజకీయ పరిణితిపై అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కి అంబేద్కర్ పై.. దళిత బహుజనులపై ప్రేమ ఉంది కాబట్టే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర సచివాలయానికి ఆ మహనీయుని పేరు పెట్టారు. కానీ మాయావతి గారు మీరు ఏం చేశారు? ఊరురా మీ పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలు పెట్టించారు. ఓట్ల కోసం మీరు చేసిన పనిని చూసి జనాలు చీకొట్టి వెళ్లగొట్టారు. ఓట్ల కోసం ఎన్నికల గుర్తుతో రాజకీయం చేసిన మీరు.. సగర్వంగా తెలంగాణ నడిబొడ్డున నిలబడిన ఆ మహనీయుడి విగ్రహ ఏర్పాటును విమర్శించడం అంటే ఆయనను అవమానించడమే అవుతుందన్నారు.

బీజేపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతుంటే మీరు కనీసం నోరు తెరవడం లేదు. ప్రజలను పట్టించుకోవడం లేదు. ఇదంతా దేనికోసం..? BJP కి మీకు లోపాయికారి ఒప్పందం ఉంది  కాబట్టే మీరు నోరు తెరవడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని మోడీ సర్కారు ప్రైవేటుపరం చేస్తోంది. అందులో లక్షలాదిగా ఉద్యోగాలు కోల్పోయి యువత రోడ్డున పడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ చేతిలోకి వెళితే రిజర్వేషన్లు ఉండవనే విషయం తెలిసి కూడా దళిత బహుజన బిడ్డల గురించి  పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.

దేశాన్ని కుదిపేసిన అదానీ స్కాం పైనా మీరు నోరు తెరవకపోవడాన్ని బట్టి మీరు ఎటువైపు ఉన్నారు? ఎవరి కోసం పని చేస్తున్నారనేది.. దేశంలోని దళిత బహుజనులందరికి అర్థమయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ బీజేపీ కోసమే పని చేసిందనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు తెలంగాణలోనూ వారు అప్పగించిన టాస్క్ పూర్తి చేయడం కోసమే మీరు వచ్చారనేది కూడా ఓపెన్ సీక్రెట్. అందుకే మీరు ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదు. ప్రజా కంఠక బీజేపీ పాలనను, బీజేపీ నాయకులను నిలదీయడం లేదన్నారు.

ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి ఇలాంటి నీచ రాజకీయాలతో  గౌరవాన్ని తగ్గించుకోకండి.  అసలు దేశంలో మీ విధానం, మీ పార్టీ విధానమేంటో స్పష్టం చేశాకే మీరు ప్రజల్లోకి వస్తే బాగుంటుంది. దళిత బహుజనుల్లో మీకు కాస్తో కూస్తో గౌరవం మిగులుతుంది.  అలాకాకుండా వారి పేరుతో బీజేపీ కోసం స్వార్ధ రాజకీయాలు చేద్దామనుకుంటే అదే దళిత బహుజనులు చూస్తూ ఊరుకోరని వై.సతీష్ రెడ్డి హెచ్చరించారు.

Latest News

More Articles