Sunday, May 19, 2024

ప్రజాపాలన పై ఇంత నిర్లక్ష్యమా? మర్లంపేట గ్యారెంటీ దరఖాస్తుల కట్ట గల్లంతు..!!

spot_img

కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీల అమలు కోసం ఆర్భాటంగా తీసుకోన్న ప్రజాపాలన దరఖాస్తులపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతున్నది. మొన్న హైదరాబాద్ రోడ్లపై అర్జీలను పడేసిన ఘటన మరువకముందే ఇలాంటి ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బోయినపల్లి మండలం మర్లపేటకు చెందిన దరఖాస్తుల కట్ట మాయం అయ్యింది. ఈ విషయం ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల మధ్య ఘర్షణకు కారణం అయ్యింది. పరస్పరం కొట్టుకున్నారు. దీంతో ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

బోయినపల్లి మండలం మర్లపేట కార్యదర్శి రాయినేని లక్ష్మణ్ సెలవుపై వెళ్లారు. పక్క గ్రామానికి చెందిన నర్సింగాపూర్ కార్యదర్శిం శేఖర్ కు గ్రామ బాధ్యతలను అప్పగించారు. ఈ మధ్య జరిగిన ప్రజాపాలనలో మర్లకుంట గ్రామస్తుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అర్జీలను మండల పరిషత్తులో ఆన్ లైన్ లో చేస్తున్నారు. ఈ బాధ్యతలను మండలాధికారులు పూర్వపు కార్యదర్శి లక్ష్మణ్ కు అప్పగించారు. లక్ష్మణ్ గురువారం ఆన్ లైన్ చేస్తుండగా ఓ దరఖాస్తు కట్ట కనిపించలేదు. దీంతో శేఖర్ కు ఫోన్ చేశారు. ఇందుకు నీదే బాధ్యత అంటూ శేఖర్ దుర్భషలాడారు.

ఈ క్రమంలో శుక్రవారం బోయినపల్లి మండల పరిషత్తులో ఎంపీవో తిలక్ వీరిద్దరితో మాట్లాడుతుండగా..అధికారులు చూస్తుండగానే ఇద్దరు కార్యదర్శులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై ఎంపీవో తిలక్ ను విలేకరులు సంప్రదిస్తే..గొడవ జరిగింది నిజమేనని తెలిపారు. పోయిన దరఖాస్తుల కట్ట దొరికిందని తెలిపారు. నిజంగానే దొరికిందా లేదా ఎంపీవో కావాలని ఆవిధంగా చెప్పారా అనేది అనుమానాలు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి: ఘోరప్రమాదం…బోల్తాపడిన బస్సు..మహిళ సజీవదహనం..!!

Latest News

More Articles