Friday, May 17, 2024

పాలించే రాజు బాగుంటే.. రాజ్యం, ప్రజలు బాగుంటారు

spot_img

ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే ప్రభుత్వ పథకాలు అమృతం వలె ఉంటాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్ మండల కేంద్రంలో నిర్వహించిన ‘సుపరిపాలన దినోత్సవం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అంతకు ముందు రూ. 2 కోట్లతో నూతనంగా నిర్మించే మండల కాంప్లెక్స్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అందరం కలిసి పనిచేయాలనే ఉద్యేశాన్ని తెలపడానికే సుపరిపాలన దినోత్సవం నిర్వహిస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిపాలన సంస్కరణలు తీసుకువచ్చాం. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే ప్రభుత్వ పథకాలు అమృతం వలె ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన జరిగింది. నూతన రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. మున్సిపాలిటీలను 62 నుండి 142కు పెంచుకున్నాం. 2014కు ముందు నాలుగు మండలాలుగా ఉన్న బాన్సువాడ నియోజకవర్గం.. ఈరోజు తొమ్మిది మండలాలు, ఒక మున్సిపాలిటీగా ఏర్పడింది. ప్రజలకు పరిపాలన దగ్గరగా ఉండడం కోసమే దూరభారం లేకుండా నూతన మండలాలు, గ్రామాలను ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్రం రాకముందుకి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‎కు బాన్సువాడ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ప్రేమ ఉండడంతో నిధులు భారీగా వస్తున్నాయి. గ్రామాలలో మౌళిక సౌకర్యాలు బాగా పెరిగాయి. ప్రజాప్రతినిధులు, ప్రజలు అడిగినన్ని నిధులు మంజూరు చేశాను. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. గ్రామాలలో ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రూపుతగాదాలు లేకుండా అధికారులను కలుపుకుని పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ప్రజల కోసం కలిసి పని చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తగాదాలు పెట్టుకుంటే నష్టపోతాం. ప్రజలు నాయకుల దగ్గరకు కాదు, నాయకులే ప్రజల దగ్గరకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేయాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి అర్హులైన వారికి అందించాలి. ప్రతి ఇంటికి తాగునీరు అందించే విదంగా ప్రజాప్రతినిధులు ఇంటిఇంటికి తిరిగి నల్లాలు పెట్టించాలి. నియోజకవర్గంలో పేదలు తక్కువ ఖర్చుతో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి 100 జనరల్ ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రోడ్లు, రవాణా సౌకర్యాలు పెంచాం. కేసీఆర్ చల్లగా నిండు నూరేళ్ళు బాగుండాలి. పరిపాలించే రాజు బాగుంటే.. రాజ్యం, ప్రజలు బాగుంటారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో తెలంగాణ పథకాలు లేవు. అక్కడి ప్రజలు బీఆర్ఎస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారు’ అని పోచారం అన్నారు.

Latest News

More Articles