Monday, May 20, 2024

సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్‎ని మించిన వారు లేరు

spot_img

కామారెడ్డి: తెలంగాణ పథకాలు తమ రాష్ట్రాలలో ఎందుకు లేవని ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని, తమకు కూడా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు కామారెడ్డి జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రక నిర్ణయం. 43,000 మంది కార్మికులకు ఇదో శుభవార్త. వారి యాబై సంవత్సరాల కల నెరవేరింది. మీరు ఇప్పుడు కార్మికులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. కేబినెట్ నిర్ణయం తదుపరి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. త్వరలోనే ఇది చట్టంగా మారుతుంది. సంస్థ ఉద్యోగులు.. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించి ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిపేరు తేవాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉన్నది. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్‎ని మించిన వారు ఎవరూ లేరు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినా.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. ప్రతిపక్షాలలో ముఖ్యమంత్రి పదవి కోసం తన్నుకోవడమే సరిపోతుంది. తెలంగాణ పథకాలు తమ రాష్ట్రాలలో ఎందుకు లేవని ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారు.తమకు కూడా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలనే నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్‎దే. పెరిగిన రాష్ట్ర ఆదాయాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. పక్కన ఉన్న కర్నాటకలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్‎గా ఉంది. తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ వన్‎గా ఉంది. 2014లో ఉన్న రూ. 1.12 లక్షల నుండి ఇప్పుడు రూ. 3.12 లక్షలకు పెరిగింది. విద్యుత్ వినియోగం‎లో నెంబర్ వన్‎గా ఉన్నాం, ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ ఉన్నాం. గత పదేళ్ళ నుండి రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. మణిపూర్, హర్యానా రాష్ట్రాలలో జరిగిన సంఘటనలు దేశానికి మంచిది కాదు. గత అయిదేళ్ళలో బాన్సువాడ నియోజకవర్గానికి పుష్కలంగా నిధులు వచ్చాయి. నియోజకవర్గ ప్రజల తరుపున ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అని స్పీకర్ పోచారం తెలిపారు.

Latest News

More Articles