Saturday, May 18, 2024

సౌతాఫ్రికాను 95 పరుగులకే ఆలౌట్ చేసిన భారత బౌలర్లు.. సిరీస్ సమం

spot_img

తప్పక గెలవాల్సిన మ్యాచ్‎లో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. కెప్టెన్ సూర్యకుమార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. బౌలర్ కుల్దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్లు తీసి మ్యాచ్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. బ్యాటర్ల మెరుపులకు బౌలర్ల సహకారం తోడవడంతో భారత జట్టు ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన తొలి సిరీస్‌ను టీమ్‌ఇండియా సమం చేసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ 106 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 2015 తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికాలో టీ20 సిరీస్‌ కోల్పోని రికార్డును కొనసాగించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 56 బంతుల్లో 100 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగి నాలుగో సెంచరీ నమోదు చేసుకోగా.. యశస్వి జైస్వాల్‌ 41 బంతుల్లో 60 పరుగులతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌, లిజాడ్‌ విలియమ్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Read Also: కేసీఆర్‌‎కు సెక్యూరిటీ తగ్గించిన పోలీస్ శాఖ

అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్మ్‌ (25; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడగా.. తక్కినవాళ్లు విఫలమయ్యారు. హెన్రిక్స్‌ (8), బ్రీట్జ్‌ (4), క్లాసెన్‌ (5), ఫెలుక్వాయో (0) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆరంభం నుంచే బౌలర్లు పట్టు బిగించడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా తడబడ్డారు. ఆరంభంలో పేసర్లు సత్తాచాటితే.. ఆ తర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపారు. కుల్దీప్‌ బంతి అందుకున్నాక ప్రొటీస్‌ కనీస ప్రతిఘటన లేకుండానే వెనుదిరిగారు. మన బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 5, జడేజా రెండు వికెట్లు పడగొట్టారు. సూర్యకుమార్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’తో పాటు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది.

Latest News

More Articles