Sunday, May 5, 2024

కేసీఆర్‌‎కు సెక్యూరిటీ తగ్గించిన పోలీస్ శాఖ

spot_img

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు భద్రత కుదిస్తున్నట్టు రాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా గెలిచిన మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేటాయించే భద్రతనే ఇచ్చినట్టు తెలిసింది. మాజీ సీఎం, క్యాబినెట్‌ ర్యాంకు కలిగిన ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు ప్రస్తుతం ‘వై’ క్యాటగిరీ భద్రతను కేటాయించినట్టు సమాచారం. థ్రెట్‌ పర్సప్షన్‌ రేట్‌(టీపీఆర్‌)కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాజీ మంత్రులకు కూడా 2+2 భద్రతను కొనసాగిస్తారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ భద్రతను పూర్తిగా తీసివేశారు. ఇటీవల ప్రజాప్రతినిధుల భద్రతపై ఇంటెలిజెన్స్‌శాఖ సమీక్ష నిర్వహించి.. మాజీ ప్రజాప్రతినిధులు, మంత్రులకు ప్రాణహాని, ఇతరుల నుంచి ముప్పుగానీ లేదని అంచనాకు వచ్చి వారి భద్రత తొలగించింది. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ నుంచి గన్‌మెన్‌లను రీకాల్‌ చేశారు.

Read Also: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రూట్‌ మార్పు

కేసీఆర్‌కు ఎస్కార్ట్‌ వాహనం.. ఇంటిముందు ఓ సెంట్రీ
కేసీఆర్‌కు ‘వై’ క్యాటగిరీ భద్రత ఇచ్చినట్టు తెలిసింది. ఆయన వెంట నిత్యం నలుగురు భద్రతా సిబ్బంది, ఎస్కార్ట్‌, పైలట్‌ వాహనాలు ఉంటాయి. పదేండ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ‘నోన్‌ సోర్స్‌’ నుంచి లేదా ‘అన్‌నోన్‌ సోర్స్‌’ నుంచి ప్రమాదం పొంచి ఉండొచ్చు. కేసీఆర్‌ భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్‌ ఇంటి ముందు ఓ సెంట్రీతో పాటు మరో ఇద్దరిని భద్రతగా ఉంచే అవకాశం ఉన్నది. మావోయిస్టులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నేటికీ పోస్టర్లు విడుదల చేస్తున్నా భద్రతను తగ్గించటం అనుమానాలను రేకెత్తిస్తున్నది. ప్రస్తుతం కేసీఆర్‌ తుంటి సర్జరీతో యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన భద్రతపై ఇంటెలిజెన్స్‌ విభాగం మరోసారి పునరాలోచించాలనే డిమాండ్‌ వినిపిస్తున్నది. కేసీఆర్‌కు ఏ తరహా క్యాటగిరీ భద్రత కేటాయించారో ఇప్పటివరకు స్పష్టంగా చెప్పలేదు.

కేటీఆర్‌, హరీశ్‌రావుకు సైతం 2+2 మాత్రమే
ఐటీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కేటీఆర్‌కు సైతం సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చిన భద్రతనే కేటాయించారు. హరీశ్‌రావుకూ 2+2 భద్రత ఇచ్చారు. ఓ సెలబ్రిటీగా, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు ఎమ్మెల్యేలతో సమానంగా భద్రత ఇవ్వటంపై పార్టీశ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతున్నది. గురువారం వరకు మాజీ మంత్రులకు 2+2 భద్రత ఉన్నదని, సాయంత్రం నుంచి వారిని కూడా వాపస్‌ తీసుకున్నారని తెలిసింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల గన్‌మెన్లను వాపస్‌ తీసుకోవాలని జిల్లాల యంత్రాంగానికి అడిషనల్‌ డీజీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేల భద్రతపై ఐఎస్‌డబ్ల్యూ మరోసారి సమీక్షించనున్నట్టు తెలిసింది. ప్రమాద ముప్పును అంచనా వేసి, భద్రత పెంచాలా? లేదా? అనేది నిర్ణయించనున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు యథావిధిగా భద్రత కొనసాగనున్నది.

Read Also: బండి సంజయ్‌కి షాకిచ్చిన సొంత నియోజకవర్గ నేతలు

Latest News

More Articles